కార్పొరేషన్, ఫిబ్రవరి 14: కరీంనగర్ నగరపాలక సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 559 కోట్లతో అంచనా బడ్జెట్ సిద్ధం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న బడ్జెట్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పాలకవర్గ సభ్యులకు ఎజెండా కాపీలను కూడా పంపించారు. అదే రోజు సాయంత్రం జనరల్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. అంచనా బడ్జెట్లో ముఖ్యంగా అభివృద్ధి పనుల కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. స్మార్ట్‌సిటీ కింద సుమారు రూ. 350 కోట్లు, పట్టణ ప్రగతి నిధులు సుమారు రూ. 26 కోట్ల మేర వస్తాయని అంచనా వేశారు. వీటితో పాటు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తే వీటి ద్వారా సుమారు రూ. 160 కోట్ల మేరకు నిధులు వస్తాయని అంచనా వేశారు. అలాగే, నగరపాలక సంస్థకు ఆస్తి, నల్లా పన్ను ద్వారా ఈసారి ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. వీటిలో ముఖ్యంగా కమర్షియల్ కోసం వినియోగిస్తున్న ఇండ్లను గుర్తించి, యజమానుల నుంచి కమర్షియల్ ఆస్తి పన్ను వసూలు చేసే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని బడ్జెట్లో పొందుపర్చారు. అలాగే, పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలకు, బల్దియా వాహనాలకు వినియోగిస్తున్న డీజిల్‌కు అత్యధిక బడ్జెట్ కేటాయించారు. ఇందుకోసం రూ. 23 కోట్ల మేరకు నిధులు కేటాయించారు. నగరంలో అభివృద్ధి పనులు, మంచినీటి సరఫరా, డ్రైనేజీల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించారు. కాగా, ఈ 19న జరిగే సమావేశంలో బడ్జెట్‌పై ఏ విధంగా చర్చ సాగుతుందో వేచి చూడాలి.