ఇల్లంతకుంట, ఫిబ్రవరి 14 : తెలంగాణను సస్యశ్యామం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మండలంలోని ఏడు గ్రామాలకు సంబంధించి సాగునీరందించేందుకు ఒగులాపూర్-కందికట్కూర్ గ్రామాల మధ్య మధ్యమానేరు నుంచి అన్నపూర్ణ ప్రాజెక్ట్‌కు వెళ్లే వరదకాలువపై ప్రత్యేక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు కోసం స్థలాన్ని సోమవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మండలంలోని వల్లంపట్ల, ఒగులాపూర్, గుడెప్పల్లి, వెల్జీపూర్, రహీంఖాన్‌పేట గ్రామాల రైతులకు సాగు నీరు అందించడం కోసమే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. మండలంలోని 33 గ్రామాలు ఉండగా అన్నపూర్ణ ప్రాజెక్టు ద్వారా వివిధ కాలువల ద్వారా సాగు నీరందించేందుకు కాలువల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ 7 గ్రామాలు ఎత్తులో ఉన్నందున మధ్య మానేరు ద్వారా ప్రత్యేకంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి 10 వేల ఎకరాలకు సాగు నీరందించే అవకాశం ఉందన్నారు. మరోవైపు తంగళ్లపల్లి మండలంలోని చీర్లవంచ, నాయినివారి పల్లి గ్రామాల రైతులకు సాగు నీరు అందిస్తామన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి వచ్చే యాసంగి వరకు రైతులకు సాగు నీరు అందించడం కోసం సిద్ధం చేసేందుకు కృషి చేస్తామన్నారు.