ధర్మపురి, ఫిబ్రవరి 13: ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో దేశ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ధర్మపురి పట్టణంలోని ఎస్‌హెచ్ గార్డెన్స్‌లో మంత్రి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్స్ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పచ్చి అబద్ధాలు, అసత్యపు ప్రచారాలు చేయడంలో బీజేపీకి ఉన్నన్ని చావు తెలివి తేటలు ఎవరికీ లేవన్నారు. బీజేపీ ప్రభుత్వం ఓ వైపు మత కలహాలు సృష్టించడం, మరో వైపు సోషల్ మీడి యా వేదికగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నదన్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని నిప్పులు చెరిగారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఎం తో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమిత్‌షా కూడా అబద్ధాలైనా సరే సోషల్ మీడియా ద్వారా ఎన్నిసార్లయినా ప్రచారం చేయాలని యువకుల్లో విషాన్ని నింపుతూ వారిని రెచ్చగొట్టేలా పిలుపునివ్వడమనేది సిగ్గు పడాల్సిన విషయమన్నారు. ఇలాంటి అబద్ధాల ప్రభుత్వానికి, అబద్ధాల ప్రధానికి దేశాన్ని పరిపాలించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్‌లో సగం కేంద్రానివేనని పచ్చి అబద్ధాలు చెప్పుకోవడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయమన్నారు. తెలంగాణ ఏర్పాటు సరిగా జరుగలేదని, తల్లిని చంపి బిడ్డను బతికించారని… ప్రధాని మోదీ చేసిన విషపూరితమైన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇవి వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఆ పార్టీలో ఉన్న మనతెలంగాణ బిడ్డలు ఆలోచించుకోవాలని హితవుపలికారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇన్ని కుట్రలు పన్నుతున్నారని, ముఖ్యంగా సోషల్‌మీడియాలో బీజేపీ ప్రభుత్వం చేసే అసత్యపు ప్రచారాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, వారు పెట్టే తప్పుడు ప్రచారాలకు వెంటనే చెంప చెల్లుమనేలా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్లు సతీశ్‌రెడ్డి, దినేశ్ చౌదరి, టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిశాంక్ మాట్లాడుతూ.. యువత సోషల్ మీడియాతో అప్రమత్తంగా ఉండాలని, సోషల్‌మీడియా వేదికగా బీజేపీ ప్రభుత్వం పచ్చి అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్నదన్నారు. సోషల్ మీడియాను ఎంతగా దుర్వినియోగం చేయవచ్చో ప్రధాని మోదీ చూపిస్తే.. సోషల్ మీడియాను ఎంత బాగా వాడవచ్చో చూపించే నాయకుడు మంత్రి కేటీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మోసపూరిత కంటెంట్‌తో ఫేక్ యూనివర్సిటీగా పేరు తెచ్చుకున్న బీజేపీ సోషల్ మీడియాలో విషప్రచారాలు చేస్తున్నదని ఆరోపించారు. యువత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.