వీణవంక, ఫిబ్రవరి 13: డివిజన్లో ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు హుజూరాబాద్ ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని సమ్మక్క-సారలమ్మ జాతర పనులను ఆదివారం కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని వీణవంక, చల్లూరు, కోర్కల్, పోతిరెడ్డిపల్లి, ఎలుబాక, గంగారం గ్రామాల్లో జాతరకు ఎక్కువ మంది హాజరుకానున్న దృష్ట్యా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. జాతర పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని కోరారు. జాతర సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతరలో భక్తులు తమ విలువైన వస్తువులతో పాటు సెల్ఫోన్లు, నగలు, డబ్బులపై జాగ్రత్త వహించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఏమైన సమస్యలు తలెత్తినా దగ్గరలోని కంట్రోల్ రూమ్, డయల్-100కు తెలుపాలని కోరారు. పోలీస్ సిబ్బంది జాతర ముగిసే వరకు 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సీఐ సురేశ్, ఎస్ఐ శేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: జాతర కమిటీ
మినీ మేడారంగా పేరొందిన వీణవంక సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్ పాడి రామకృష్ణారెడ్డి, సర్పంచ్ నీల కుమారస్వామి, యప్‌టీవీ సీఈవో పాడి ఉదయ్‌నందన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని వనదేవతల గద్దెల వద్ద కొబ్బరికాయలు కొట్టి జాతర పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భక్తులకు విశ్రాంతి గదులు, మంచినీటి సౌకర్యం, వైద్య సౌకర్యం, టాయిలెట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వోరెం భానుచందర్, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత, మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.