గోదావరిఖని, ఫిబ్రవరి 13: మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. 50మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని చెప్పారు. పండుగకు కొత్త బట్టలు కొనుక్కోలేని పేద ముస్లింల కండ్లల్లో ఆనందం చూడడానికి రంజాన్ తోఫా అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పేద ముస్లిం పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు. ఇందుకు ముస్లిం, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై రూ.లక్షా 64వేలను ప్రభుత్వం ఖర్చు పెడుతున్నదన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడం కోసం రూ.20లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నదని చెప్పారు. పేద ముస్లిం ఆడపిల్లల వివాహానికి షాదీ ముబారక్ కింద రూ.లక్షా నూటాపదహార్లు అందిస్తున్నదన్నారు. ఓసీపీ-5 నిర్మాణంలో కోల్పోతున్న ఈద్గా, ఖబరస్తాన్ స్థలాన్ని ఇప్పించేందుకు పలుసార్లు సింగరేణి డైరెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో 20 ఏండ్లుగా కీలక పదవుల్లో ఉన్న మీర్ ఫయాజ్ అలీ, ఎండీ సాజిద్, అసిఫొద్దీన్ తదితరులు టీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జాహెద్ పాషా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ అనిల్‌కుమార్, కార్పొరేటర్లు రాజ్‌కుమార్, కన్నూరి సతీశ్, శంకర్‌నాయక్, నాయకులు కల్వల సంజీవ్, సలీం, దేవరాజ్, నూతి తిరుపతి, చల్ల రవీందర్, చెల్కలపల్లి శ్రీనివాస్ తదితరులున్నారు.