చిగురుమామిడి, ఫిబ్రవరి 13: మండలంలోని అత్యధికమంది రైతులు యాసంగిలో ఆరుతడి సాగుకే మొగ్గు చూపారు. వరి సాగును గణనీయంగా తగ్గించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వరికి ప్రత్యామ్నాయగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా వ్యవసాయాధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. అలాగే సీఎం కేసీఆర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులు వరి సాగు చేసి నష్టపోవద్దని చెప్పారు. ఆరుతడి సాగుపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. మండలంలో గత యాసంగి లో 19వేల ఎకరాలకు పైగా వరి సాగు చేయగా, ఈసారి 11వేల ఎకరాల్లోనే సాగుచేశారు. ఎనిమిది వేల ఎకరాల్లో వరి సాగుకు స్వస్తి పలికిన రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు వరికి బదులు ఇతర పంటలు సాగు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి..
యాసంగిలో చాలా మంది రైతులు వరి స్థానంలో సన్ ఫ్లవర్, మక, పల్లి, పెసర, మినుము, నువ్వు తదితర పంటలు సాగు చేశారు. వ్యవసాయాధికారులు సూచించిన పంటలనే సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయదని తెలిసి రైతులు ఒకింత నిరాశకు గురైనా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.
గ్రామాల్లో అవగాహన కల్పించాం
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులతో కలిసి రైతులకు వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలని అవగాహన కల్పించాం. క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి ఆరుతడి సాగు ప్రయోజనాలను వివరించాం. దిగుబడి, లాభాల గురించి తెలిపాం. చాలా మంది రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపారు.
– రంజిత్‌కుమార్, మండల వ్యవసాయాధికారి
రైతులపై కేంద్రం వివక్ష
గోదావరి జలాలతో సస్యశ్యామలంగా ఉన్న గ్రామాల్లో ఇన్నాళ్లు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశాం. కేంద్రం నిర్ణయం తో ఈసారి వడ్లు కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరుతడి సాగుకు మొగ్గు చూపాం. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించు కుంటున్నాం. ఏదేమైనా కేంద్రం నిర్ణయం సరికాదు.
– కయ్యం వీరయ్య, రైతుబంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్, ములనూరు