జైపూర్ విద్యుత్ కేంద్రం.. కరెంట్ ఉత్పత్తికే పరిమితం కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నది. దీంతో జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్ కేంద్రాలను వెనక్కి నెట్టి సత్తా చాటుకుంటున్నది. అందులో భాగంగానే గతేడాది నాలుగు పురస్కారాలను కైవసం చేసుకున్నది. సంప్రదాయ విద్యుత్ కేంద్రాలతో పోల్చుకుంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ చాలా సవాళ్లతో కూడుకున్నది. ఎంతో మంది కార్మికులు పలు విభాగాలుగా విడిపోయి తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే తప్పా విద్యుత్ ఉత్పత్తి జరుగదు. ఈ క్రమంలో పర్యావరణంతో పాటు ప్రభావిత, పరిసర గ్రామాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వీటన్నింటినీ దాటుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేయడంలో ఎస్టీపీపీ తన మార్కును చాటుకుంటున్నది. దీంతో ముంబైకి చెందిన ‘మిషన్ ఎనర్జీ ఫౌండేషన్’ ఎస్టీపీపీ పనితీరును గుర్తించి రెండు పర్యాయాలు అవార్డులతో గౌరవించింది.
వ్యర్థానికి నూరుశాతం అర్థం..
థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే వ్యర్థాల్లో బూడిద ప్రధానమైంది. దీన్ని ఫ్లైయాష్, బాటం యాష్గా పిలుస్తారు. ఎస్టీపీపీలో రోజూ సుమారు 16వేల టన్నుల వరకు బొగ్గు అవసరం ఉంటుంది. దాన్ని మండించడం ద్వారా 5500 టన్నుల వరకు బూడిద ఉత్పత్తి అవుతుంది. దాని స్వభావాన్ని బట్టి వేరుచేసి ఆయా అవసరాలకు వినియోగిస్తారు. స్థానిక, సింగరేణి అవసరాలకు ఉచితంగా వినియోగించడంతో పాటు ఎవరికైనా అవసరముంటే టన్నుకు రూ.80 చొప్పున విక్రయిస్తారు. ఇలా ఫ్లైయాష్ ద్వారా సంస్థకు నెలకు రూ.40 లక్షల ఆదాయం సమకూరుతున్నది. దీంతో గతేడాది బూడిదను సక్రమంగా వినియోగించుకున్నందుకుగానూ గోవాలో జరిగిన సమావేశంలో జాతీయస్థాయిలో ‘ఫ్లైయాష్ యుటిలైజేషన్ అవార్డు’ను డైరెక్టర్ ఈఅండ్ఎం సత్యనారాయణరావుకు అందించారు.
దక్షిణాదిలో ఉత్తమం..
దక్షిణ భారతదేశంలో ఉన్న 500 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్కేంద్రాల్లో ఎస్టీపీపీ ఉత్తమంగా నిలిచింది. బొగ్గు, నీరు, ఆయిల్ వినియోగం తగ్గించడం.. తక్కువ అంతర్గత విద్యుత్ వినియోగం, పూర్తిస్థాయిలో పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ)ని సాధించినందుకుగానూ ఉత్తమ పనితీరు (బెస్ట్ ఫర్పామర్ ) అవార్డు అందుకుంది. ఇప్పటివరకు ఎస్టీపీపీ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోని 25 కేంద్రాల్లో పోటీ పడుతూ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది.