కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 7: మార్కెట్ రోడ్డు వేంకటేశ్వస్వామి పంచమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం పుట్టమట్టి తీసుకువచ్చే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ, గోవింద నామస్మరణ, కోలాట నృత్యాల మధ్య పుట్టమట్టిని తెచ్చారు. ఉత్సవ నిర్వాహకుడు, మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు, మేయర్ వై సునీల్‌రావు, జడ్పీ చైర్పర్సన్ విజయ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్మలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో కిషన్‌రావు ఆధ్వర్యంలో భగత్‌నగర్ అయ్యప్ప ఆలయంలో శాస్త్రోక్తంగా పృథ్వీపూజ నిర్వహించారు. అనంతరం పుట్టమట్టిని ఆలయానికి తీసుకవచ్చి శ్రీవారి పాదాలచెంత ఉంచారు. సాయంత్రం యాగశాలలో అంకురార్పణ, దీక్షా స్వీకారం జరిపించారు. కార్యక్రమాల్లో అర్చకులు నాగరాజాచార్యులు, లక్ష్మీనారాయణాచార్యులు, ఆలయ అర్చకులు మంగళంపల్లి రాజేశ్వరశర్మ, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఉత్సవ కమిటీ బాధ్యులు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కనుల పండువగా శేషవాహన సేవ
శేషవాహన సేవ కన్నుల పండువగా సాగింది. సోమవారం సాయంత్రం ఆలయానికి చేరుకున్న ఉత్సవాల ప్రధాన నిర్వాహకులు, మంత్రి గంగుల కమలాకర్ స్వామివారికి పుష్పాలు, పూజా సామగ్రి సమర్పించారు. అనంతరం యాగశాల ప్రవేశం చేసి, కంకణధారణ చేసుకున్నారు. శ్రీవారి శేషవాహనానికి పూజలు నిర్వహించి, మాఢ వీధుల్లో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆద్యంతం శోభాయాత్ర కనుల పండువగా సాగగా, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణ ఈవెంట్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గోగుల ప్రసాద్ నేతృత్వంలో ఉదయం సాయిభక్త, వేణుగోపాలస్వామి, గాయత్రి భజనమండళ్ల భజనలు, మాతృమండలి పారాయణం చేపట్టారు. సాయంత్రం శారదా సంగీత పాఠశాల విద్యార్థుల భక్తి సంగీతం, రతన్‌కుమార్ బృందం పేరిణీ లాస్యం, నృత్యం, బొజ్జ రేవతి శిష్యబృందం భక్తి కీర్తనలు, శ్రీలేఖ, శ్రీకుమారి భక్తి కీర్తనలు, ప్రీతి, రాజు అన్నమాచార్య కీర్తనలు భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. సినీ నేపథ్యగాయని గీతామాధురి, సూర్య, గోగుల ప్రసా ద్ భక్తి సంగీతగానామృతం ఆకట్టుకున్నది.