కాల్వశ్రీరాంపూర్, ఫిబ్రవరి 7:కాల్వశ్రీరాంపూర్ మండలం మడిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. కానీ కాలక్రమేణా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. కేవలం 8మంది విద్యార్థులతో ముక్కుతూ మూలుగుతూ నడిచింది. అప్పటి సమైక్య ప్రభుత్వాలు విద్యాలయాన్ని పట్టించుకోకపోవడం, ఇంకా ప్రైవేట్‌లో ఆంగ్ల మాధ్యమ బోధనతో మూతపడే స్థితికి చేరింది. కానీ 2013లో గుండ మల్లికార్జున్ హెచ్ఎంగా రావడం, ఆ కొద్దిరోజులకే స్వరాష్ట్రం సిద్ధించడంతో పాఠశాలకు జీవం వచ్చింది. రాష్ట్ర సర్కారు చర్యలు, హెచ్ఎం, టీచర్ల కృషి, గ్రామస్తుల సహకారంతో పూర్వవైభవం సంతరించుకున్నది.
ఆంగ్ల మాధ్యమంతో జీవం
టీచర్లు, గ్రామస్తుల కృషితో గాడినపడ్డ పాఠశాలకు మరింత బలోపేతం చేసేందుకు 2015లో ఆంగ్ల బోధన ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించడం మొదలుపెట్టారు. అప్పటిదాకా 8మందితో ఉన్న పాఠశాలలో అతి తక్కువ టైంలోనే పిల్లల సంఖ్య పెరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందిస్తుండడంతో ఊళ్లోని పిల్లలంతా ప్రైవేట్‌ను వదిలి స్కూల్‌కే వస్తున్నారు. ప్రస్తుతం 29 మంది అభ్యసిస్తున్నారు.
వీళ్లు.. ఆదర్శం
గ్రామస్తులు కాదు ముందుగా తమ పిల్లలను పాఠశాలకు పంపించి ఆదర్శంగా నిలిచారు సర్పంచ్ సర్పంచ్ అడిగొప్పుల రాణి మోహన్ దంపతులు. వారి పిల్లలతోపాటు వార్డు సభ్యుల పిల్లలు, అక్కడి ఆర్టీసీ డ్రైవర్ ఖాదర్ పిల్లలను ఇక్కడే చదివిస్తున్నారు. అలాగే ఇదే పాఠశాలలో పని చేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయురాలు కవిత తన ఇద్దరు పిల్లలను ఇదే పాఠశాలలో చదివిస్తున్నారు. కాగా, స్కూల్లో ప్రతి రోజు కంప్యూటర్‌తో పాటు, స్పోకెన్ ఇంగ్లిష్ చెబుతున్నారు. గత విద్యా సంవత్సరంలో తూడి హరిణి అనే విద్యార్థికి చొప్పదండి నవోదయలో సీటు వచ్చింది. కాగా, హెచ్ఎం కృషిని గుర్తించిన సర్కారు 2020-21లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రశంస పత్రం అందించింది.
సకల సౌకర్యాలు
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. విశాలమైన తరగతి గదులు ఉన్నాయి. ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందుతుంది. ఇంకా అనుభవజ్ఞులైన టీచర్లతో ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన ఉచిత విద్య అందుతుంది. అందుకే తమ ఇద్దరి పిల్లలను ఈ పాఠశాలలోనే చదివిస్తున్నం. మమ్ముల్ని చూసి మా గ్రామస్తులంతా తమ పిల్లలను ఇదే పాఠశాలలో చదివిస్తున్నరు. ఏ ఒక్కరూ ప్రైవేటుకు పోవడంలేదు. రాష్ట్ర సర్కారు నిర్ణయొంతో వచ్చే సంవత్సరం నుంచి చుట్టు పక్కల గ్రామాల పిల్లలు స్కూల్‌కు వచ్చే అవకాశం ఉంది.
– అడిగొప్పుల రాణి, మోహన్ దంపంతులు, సర్పంచ్, మడిపల్లి
దాతల సహకారం..
పాఠశాలకు దాతలు అండగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు 25 కుర్చీలు అందించారు. అలాగే – విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 10 బేంచీలు అందజేశారు. ఇంకా సర్పంచ్ అడిగొప్పుల రాణిమోహన్ దంపతులు సౌండ్ సిస్టం అందజేశారు.
గ్రామస్తుల సహకారం మరువలేనిది
మూతపడే దశలో ఉన్న స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామస్తుల సహకారం మరువలేనిది. గ్రామంలోని పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలకే వస్తున్నారు. గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల బోధన అందిస్తున్నాం. ‘మన ఊరు-మనబడి’లో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం పాఠశాలలో మౌళిక వసతులు కల్పిస్తే చుట్టు పక్కల గ్రామాల పిల్లలు కూడా పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది.
– జీ మల్లిఖార్జున్, హెచ్ఎం, మడిపల్లి(కాల్వశ్రీరాంపూర్)