సైదాపూర్, ఫిబ్రవరి 7: విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సోమారం సర్పంచ్ పైడిమల్ల సుశీలాతిరుపతిగౌడ్ పేర్కొన్నారు. మండలంలోని సోమారం మోడల్ స్కూల్లో నెహ్రూ యువకేంద్రం, బజరంగ్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పాజిటివ్ లైఫ్‌ైస్టెల్, ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ యువకులు ఉన్నత చదువులతోపాటు క్రీడలు, యోగాలాంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం డీవైసీ వెంకట్రాంబాబు, వలంటీర్ గురాల లక్ష్మారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ బాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ పర్హానా, అధ్యాపకుడు అశోక్, బజరంగ్ యూత్ సభ్యులు ఉన్నారు.
గంజాయి, డ్రగ్స్ అలవాటు చేసుకోవద్దు
గంజాయి, డ్రగ్స్ అలవాటు చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ చల్లా మధుకర్‌రెడ్డి సూచించారు. సోమారం ఆదర్శ పాఠశాలలో పోలీసులు విద్యార్థులకు డ్రగ్స్, గంజాయిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువకులు, విద్యార్థులకు డగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ వ్యసనాలు వీడి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. హెడ్‌కానిస్టేబుల్ బాల్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
మత్తు పదార్థాలపై అవగాహన
జిల్లా ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు జమ్మికుంట ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం గంజాయి వద్దు -ఆరోగ్యం ముద్దు అంటూ మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్, ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో గంజాయి, డ్రగ్స్ తీసుకుంటే వచ్చే ఆరోగ్య సమస్యలను ప్రజలకు వివరించారు. డ్రగ్స్ విక్రయం, వినియోగం నేరమని, గుండుబా తయారు చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి సరఫరా గురించి తెలిస్తే 9440902693 ఫోన్ నంబర్‌కు సమాచారమివ్వాలని కోరారు. ఇక్కడ ఎక్సైజ్ ఎస్ఐలు రమాదేవి, కబీర్, కానిస్టేబుళ్లు బాలాసుందర్రావు, పద్మావతి, శైలజ తదితరులు ఉన్నారు.