రాంనగర్, డిసెంబర్ 9 : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య, సామర్థ్య పరీక్షలు రెండో రోజు ప్రశాంతంగా కొనసాగాయి. పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ ప్రత్యక్ష పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన పరీక్షల్లో 304 మంది అర్హత సాధించారు. 801మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 605 మంది వచ్చారు. 301 మంది అర్హత సాధించలేకపోయారు. 94 మంది గైర్హాజరయ్యారు. 102 మంది అభ్యర్థులు అనారోగ్య కారణాలను చూపుతూ వైద్య ధ్రువీకరణపత్రాలు సమర్పించారు. వైద్యుల పరిశీలన అనంతరం సదరు అభ్యర్థులకు ఇతర తేదీల్లో హాజరయ్యేందుకు అనుమతించారు. తొలుత అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, బయోమెట్రిక్, రిజిస్ట్రేషన్, రిస్ట్ బ్యాండ్ టాగింగ్, ఆర్ఎస్ఎస్ ఐడీ బిబ్ జాకెట్లను ధరింపజేశారు.
1600 మీటర్ల పరుగులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలతోపాటు రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్ విభాగాల్లో పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే వచ్చి క్యూలో ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ జీ చంద్రమోహన్, ఏసీపీలు విజయసారథి, ప్రతాప్, మదన్‌లాల్, సత్యనారాయణ, ఎస్బీఐ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మునిరత్నం, మినిస్టీరియల్ విభాగం అధికారులు, సిబ్బంది, ఇన్స్పెక్టర్లు సృజన్‌రెడ్డి, జే సురేశ్, ఆర్ఐలు జానీమియా, కిరణ్‌కుమార్, మురళి, మల్లేశం, వైద్యాధికారులు, సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.