కరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జగిత్యాల (నమస్తే తెలంగాణ) : జగిత్యాల గడ్డపై బుధవారం జరిగిన బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ అయింది. అంచనాలకు మించి లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఎటుచూసినా ‘జై కేసీఆర్, దేశ్‌కీ నేత కేసీఆర్’ అంటూ నినాదాలు మార్మోగగా గులాబీ జెండాలు రెపరెపలాడాయి.. జగిత్యాల జైత్రయాత్ర తర్వాత అది పెద్ద సభ ఇదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, సభ సక్సెస్ అయిన తీరుపై ఇతర పార్టీల శ్రేణుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అడుగడుగునా టీఆర్ఎస్ నేతల్లో సమన్వయం కనిపించగా, ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.
సభ సాగిన తీరు, తరలివచ్చిన జన ప్రభంజనంతో శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణ ఉద్యమం నాటి పాత జ్ఞాపకాలను గుర్తుచేసిన సీఎం, అడుగడుగునా ఆనాటి కష్టాలను కన్నీళ్లను వివరించడంతో పాటు స్వరాష్ట్రంలో జగిత్యాల జిల్లా వేదికగా జరిగిన సమగ్రాభివృద్ధిని కండ్లకు కట్టినట్లుగా చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. మరోవైపు గులాబీ శ్రేణులు దండులా కదిలి రావడంతో సభాప్రాంగణం కిక్కిరిసిపోగా, ఇంకా వేలాది వాహనాలు జనంతో రోడ్లపైనే ఉండిపోయాయి. నిజానికి సభ నిర్వహణకు తక్కువ సమయం ఉన్నది. అయితే, మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో సభా నిర్వహణ ఏర్పాట్లు చేశారు.
జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులంతా సభ సక్సెస్‌పై దృష్టిపెట్టారు. సభ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడంతోపాటు నాయకులంతా కలిసికట్టుగా పనిచేశారు. నిర్ణీత సమయంలో ఆయా ప్రాంతాల నుంచి జనం సభకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా జనం తరలివచ్చింది. సీఎం సభాస్థలికి చేరుకోవడానికి రెండు గంటల ముందే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభ లోపల కాలు మోపేందుకు కూడా జాగ లేకపోవడంతో వేలాది మంది జనం చుట్టూ నిలబడిపోయారు. ఇదే సమయంలో జగిత్యాల సభా ప్రాంగణానికి చేరుకోకుండానే వేలాది వాహనాలు, జగిత్యాలకు వచ్చే నాలుగు రహదారుల్లో సుమారు 20 కిలోమీటర్ల పొడువునా జనంతో నిలిచిపోయాయి. ఎక్కడికక్కడే వాహనాలు స్తంభించిపోవడంతో ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చాలా మంది ముఖ్యమంత్రిని చూడకుండానే వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అతిపెద్ద సభ.. నయా జోష్
జగిత్యాల జైత్రయాత్ర తదుపరి ఈ గడ్డపై జరిగిన అతి పెద్ద సభగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎన్నో సభలు జరిగాయని, కానీ ఈ సభ కోసం వస్తూ రోడ్లపై కిలోమీటర్ల పొడవునా వాహనాలు స్తంభించిపోయిన పరిస్థితులు చూడలేదని పలువురు జగిత్యాలవాసులు పేర్కొన్నారు. సభ అనుకున్నదానికి మించి సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో నయా జోష్ కనిపించింది. లక్షలాదిగా తరలివచ్చిన జనాలను చూస్తూ టీఆర్ఎస్ నాయకులు హుషారుగా నినదించారు. ‘జై కేసీఆర్.. దేశ్‌కీ నేత కేసీఆర్’ అంటూ ఉత్సాహంతో చేసిన నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. యావత్తు టీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో పనిచేసిన తీరు సభకు సక్సెస్‌కు నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో స్వయంగా సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్‌రావుతోపాటు సమన్వయం చేస్తూ సభను సక్సెస్చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు
జగిత్యాల గడ్డ వేదికగా జరిగిన సభ తీరు ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ సభ ఎలా జరుగుతుందన్న దానిపై గడిచిన కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు వాచ్ చేస్తున్నాయి. వారి వాదనలు, అంచనాలను తలకిందులు చేస్తూ లక్షలాదిగా జనం తరలివచ్చిన తీరు వారికి కంటిపై కునుకు లేకుండా చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, జగిత్యాల గడ్డ వేదికగా జరిగిన ఉత్తర తెలంగాణ రాజకీయాలపై పెనుప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం టీఆర్ఎస్ సభ గ్రాండ్ సక్సెస్‌ను జీర్ణంచుకోలేకపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గులాబీ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారని చెప్పడానికి ఇదో నిదర్శనమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా, సీఎం ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేస్తూ.. కష్టాలను వివరిస్తూ. జరిగిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్లుగా వివరించిన తీరు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నది.