జగిత్యాల, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లాలో బుధవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం కాగా, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. జగిత్యాలలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంతోపాటు, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే రూ.119 కోట్ల అంచనాలతో నిర్మించనున్న మెడికల్ కాలేజీ భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం జగిత్యాల అర్బన్ మండలం పరిధిలోని మోతె గ్రామ శివారులో లక్షలాది మంది పాల్గొన్న భారీ బహిరంగ సభకు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
సమీకృత కలెక్టరేట్ కార్యాలయంతోపాటు, మెడికల్ కాలేజీ భవన నిర్మాణ భూమిపూజకు అన్ని ఏర్పాట్లు చేసిన కలెక్టర్ జీ రవి, ఎస్పీ సింధూ శర్మ, అదనపు కలెక్టర్లు మందా మకరంద్, లతను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టరేట్‌తో పాటు, భూమిపూజ కార్యక్రమాలను చక్కగా ఆర్గనైజ్ చేశారన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. తమను ప్రత్యేకంగా అభినందించడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేసి, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, భారీ బహిరంగ సభను అత్యంత విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌తో పాటు, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ముఖ్యమంత్రి ప్రసంగం వినేందుకు తరలివచ్చార. మధ్యాహ్నం 2.30 గంటల వరకే సభా స్థలి పూర్తిగా నిండిపోయింది.
మూడున్నర వరకు ఏకంగా కిక్కిరిసిపోయింది. సభా స్థలంలో ఎంత మంది ఉన్నారో, బయట రోడ్లపై అంతే జనం కనిపించారు. ట్రాఫిక్ జామ్ కావడంలో చాలా వాహనాలు సభ వరకు రాలేకపోయాయి. అయితే, సభకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా పార్టీ శ్రేణులు అన్ని సౌకర్యాలు కల్పించాయి. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. వాహనాలను పార్కింగ్ చేసేందుకు సభా స్థలికి నలువైపులా నియోజకవర్గాల వారీగా ఎనిమిది పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి, క్యూఆర్ కోడ్‌ను కేటాయించారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా వాహనాలను సభ వరకు రప్పించగలిగారు.
దాదాపు 30 ఎకరాల స్థలాన్ని మూడు నాలుగు రోజుల్లోనే చదును చేసి, బారికేడ్లు, డయాస్, కళాకారుల బృంద ప్రదర్శన డయాస్ ఏర్పాట్లు చేయించడంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కీలక పాత్ర పోషించారు. సభలో ప్రసంగం ముగిస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి, ఆశీర్వాదాలు ఇవ్వడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. అలాగే, జగిత్యాల సభను గొప్పగా, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నిర్వహించిన మంత్రులు హరీశ్‌రావు, ఈశ్వర్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును అభినందించారు.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు
జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. దీంతోపాటు, రూ.119 కోట్లతో నిర్మించనున్న కొత్త మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు. కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని, కలెక్టర్ జీ రవిని కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, చక్కటి పరిపాలన భవనాన్ని నిర్మించుకొని, తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తున్నందుకు ఆనందంగా ఉందని, అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందనీయులన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణం సైతం త్వరలోనే పూర్తి చేస్తామని, దేశంలోనే ఆదర్శ మెడికల్ కాలేజీగా జగిత్యాల గుర్తింపు పొందాలని ఆయన ఆకాంక్షించారు. టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపెల్లి వినోద్‌కుమార్, పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకాని, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఎల్ రమణ, తానిపర్తి భానుప్రసాద్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల, వేములవాడ, చొప్పదండి, మానకొండూర్, రామగుండం, పెద్దపెల్లి ఎమ్మెల్యేలు డా. ఎం.సంజయ్‌కుమార్, చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, సీఎంవో సెక్రెటరీ స్మితా సబర్వాల్, ఎస్పీ సింధూ శర్మ, అదనపు కలెక్టర్లు మందా మకరంద్, బీఎస్ లత, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్,
జగిత్యాల, పెద్దపెల్లి జిల్లా పరిషత్ అధ్యక్షులు దావ వసంత, పుట్ట మధు, అధికార భాషా సంఘం చైర్మన్ మంత్రి శ్రీదేవి, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జీవీ రామకృష్ణారావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వర్రావు, పునుగోటి శ్రీనివాసరావు, ఓరుగంటి రమణారావు, హెచ్‌సీఏ సభ్యుడు, టీఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు దావ సురేశ్, మోతె సర్పంచ్ సురకంటి స్వప్నరాజేశ్వర్రెడ్డి, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పెల్లి, రాయికల్ మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఏఎంసీ చైర్మన్లు, ప్యాక్స్ చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.