జమ్మికుంట రూరల్, డిసెంబర్ 7: ప్రేమించి మోసం చేసి, మరో యువతిని వివాహం చేసుకున్నాడని ప్రియుడి ఇంటిముందు మూడు రోజులుగా ప్రియురాలు చేస్తున్న నిరసన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం…. మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన రాచపల్లి మధు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవి చెల్పూర్‌కు చెందిన ఎండీ ఆస్మాబేగం 2017లో వర్ధన్నపేట్లోని అరుషి గ్రూప్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చేశారు. ఈ క్రమంలో మధు ఆస్మా బేగంతో ప్రేమ వ్యవహరం సాగించాడు.
హైదరాబాద్‌లో స్నేహితుడి రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు. కొద్ది రోజులకు ఆమె ఓం సాయి దవాఖానలో రిసెప్షనిస్ట్‌గా చేరింది. రెండు సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం సాగించారు. కొద్దిరోజుల క్రితం మధు వ్యవసాయం చేసుకుంటానని స్వగ్రామానికి వచ్చి మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆస్మా బేగం మూడు రోజుల క్రితం మధు ఇంటి వద్దకు వచ్చి నిరసన చేపట్టింది. ఎవరూ పట్టించుకోక పోవడంతో కాలనీలోని మహిళల సహకారంతో అకడే ఉంటూ నిరసన సాగిస్తున్నది. న్యాయం జరిగే వరకు పోరాటం నిర్వహించనున్నట్లు బాధితురాలు తెలిపింది.
న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం
ప్రేమించి మోసపోయిన ఆస్మాబేగానికి న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటాం. ప్రేమించి మోసం చేయడం ఎంతవరకు న్యాయం. ఇప్పటివరకు పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు. ఆమెకు మేమే భోజనం పెడుతున్నాం. న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటాం.
-సంగెం వనజ ( బిజిగిరి షరీఫ్ గ్రామస్తురాలు)