పెగడపల్లి , ఫిబ్రవరి 6: హైలెవల్ వంతెనల నిర్మాణంతో ప్రయాణికుల వెతలు తీరాయి.. ఇన్నాళ్లు వానకాలం వచ్చిందంటే ఊర్లు దాటేందుకు నరకం అనుభవించిన ప్రజలకు బ్రిడ్జిల నిర్మాణంతో ప్రయాణ బాధలు తప్పాయి. మంత్రి కొప్పుల చొరవతో పెగడపల్లి మండలంలోని ఆరుచోట్ల రూ.13 కోట్లతో వంతెనలు నిర్మించగా, ఇక తమ ప్రయాణ ఇబ్బందులు తప్పినట్టేననని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయించిన అమాత్యుడికి రుణపడి ఉంటామని చెబుతున్నారు.
వానకాలం వచ్చిందంటే పెగడపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు నానా తిప్పలు పడేవారు. వాగులు, వంకలు దాటుకుంటూ ప్రమాదకర పరిస్థితుల్లో వెళ్తుండేవారు. దూరభారంతో సతమతమయ్యేవారు. సమైక్య పాలకులకు విన్నవించినా పెడచెవిన పెట్టేవారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్, ప్రస్తుత రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆరుచోట్ల బ్రిడ్జిలు అవసరమని గుర్తించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించండంతో పాటు రూ.13 కోట్లు మంజూరు చేయించారు. పెగడపల్లి సమీపంలో కరీంనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై రూ.3 కోట్లతో హై-లెవల్ వంతెనను నిర్మించారు. పెగడపల్లి నుంచి గంగాధర మీదుగా కరీంనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో నందగిరి, ఐతుపల్లి వద్ద రూ.2 కోట్ల చొప్పున వెచ్చించి రెండు వంతెనలు నిర్మించారు. దేవికొండ, ల్యాగలమర్రి గ్రామాల మధ్య దేవికొండ వద్ద రూ.2 కోట్లు, ల్యాగలమర్రి వద్ద రూ.3 కోట్లతో రెండు, ల్యాగలమర్రి నుంచి రాంబద్రునిపల్లికి వెళ్లే రోడ్డులో రూ.కోటితో హై-లెవల్ వంతెన నిర్మించారు. అంతేకాకుండా రోడ్లను వెడల్పు చేశారు. వంతెల నిర్మాణంతో పాటు, రోడ్ల అభివృద్ధితో ప్రజలు సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారు. మంత్రి కొప్పులతోనే వంతెనల కల సాకారమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం..
నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్ల అభివృద్ధ్దికి అధిక ప్రాధాన్యత ఇస్తు న్నాం. వంతెనలు, రహదారుల అభివృద్ధికి రూ. వందల కోట్లు మంజూరు చేయించిన. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు బుగ్గారం మినహా, రెండు వరుసల రోడ్ల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. అన్ని మండల కేంద్రాల్లో మురుగుకాల్వలు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణానికి సుమారు రూ.30 కోట్లు మంజూరు చేశాం. శరవేగంగా హైలెవల్ వంతెనలు నిర్మించుకున్నాం.
-రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్