ఫర్టిలైజర్‌సిటీ, డిసెంబర్ 6: నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని రామగుండం పోలీసు కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నా రు. నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధి గౌతమి నగర్లో ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన 50 సీసీ కెమెరాలను మంగళవారం సీపీ తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌తో కలిసి ప్రారంభించి, మాట్లాడారు. దేశంలో సీసీ కెమెరాల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. సీసీ కెమెరాలతో ప్రజలకు మరింతగా రక్షణ కల్పించవచ్చని, ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చన్నారు. కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాలతో అనేక కీలక కేసులను ఛేదించామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కార్పొరేటర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, వ్యపారస్తులు పోలీసు శాఖకు సహకరించాలన్నారు. గౌతమినగర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ఎఫ్‌సీఐ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ సభ్యులు, కాలనీవాసులను అభినందించిన సీపీ కృషి చేసిన ఏసీపీ, సీఐ, ఎస్ఐలకు అభినందనలు తెలిపారు. ఇక నుంచి గౌతమినగర్ నిఘా నీడలో ఉంటుందన్నారు. ఇక్కడ గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, రామగుండం సీఐ ముత్తి లింగయ్య, ఎన్టీపీసీ ఎస్ఐ జీవన్, అంతర్గాం ఎస్ఐ సంతోష్, సొసైటీ సభ్యులు, స్థానికులు ఉన్నారు.