కార్పొరేషన్, నవంబర్ 24 : ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్’ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో కరీంనగర్ వేదికగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్, కరీంనగర్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సంస్థలు, అలాగే రుణ సౌకర్యం కల్పించే పలు బ్యాంకులు పాల్గొననున్నాయి. ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు. ఈ ప్రాపర్టీ షోకు మెయిన్ స్పాన్సర్లుగా పీ మంగాత్రం, అపర్ణ, హైదరాబాద్ కంపెనీలు, అసోసియేట్ స్పాన్సర్‌గా రాయిచందని సింధ్ డెవలపర్స్, కో స్పాన్సర్లుగా ఆదర్శ కంఫర్ట్స్, బిల్డ్ అర్బన్ కన్స్ట్రక్షన్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్, స్పాన్సర్లుగా ఉస్మాని కన్స్ట్రక్షన్స్, మైత్రి గ్రూప్స్, రాయల్ రిడ్జ్, డ్యూరో, రెప్కో హోమ్లోన్స్, శ్రీ వెంకటేశ్వర అవెన్యూ, కేకే ఎంటర్ ప్రైజెస్స్, బ్యాంకులు ఎస్బీఐ, యుబీఐ, బీవోబీ, కేడీసీసీబీ కొనసాగుతున్నాయి.
కార్పొరేషన్, నవంబర్ 24: కరీంనగరంలో రియల్ హవా నడుస్తున్నది. సిటీ రోజు రోజుకూ విస్తరిస్తుండడం, హైదరాబాద్ తర్వాత అభివృద్ధిలో ముందంజలో ఉండడంతో ఇక్కడి భూములకు భలే డిమాండ్ ఏర్పడింది. నగరంలో ఒకప్పటితో పోలిస్తే నిరంతరాయంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ముఖ్యంగా గతంలో రోడ్లు, డ్రైనేజీలు అంతంత మాత్రంగానే ఉండగా, రాష్ట్రం వచ్చిన ఎనిమిదేండ్లలోనే ఎంతో మార్పు జరిగింది. నగరంలోని ప్రధాన రోడ్లు అద్భుతంగా అభివృద్ధి చెందగా, అంతర్గత ముఖ్యమైన రోడ్లు సుందరంగా మారుతున్నాయి. గతంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలంటే ఎక్కువగా సమయం పట్టేది. కానీ, ప్రస్తుతం 5 నుంచి 10 నిమిషాల్లోనే సిటీ సెంటర్‌కు చేరుకునేలా రోడ్లు విశాలంగా మారాయి. దీంతో నగర శివారు ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఇండ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు నూతన కాలనీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది.
శరవేగంగా కరీంనగర్ అభివృద్ధి
కరీంనగర్ రాష్ట్రంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే నగరంతోపాటు శివార్లలోని ప్రాంతాల్లోనూ గృహ నిర్మాణాల ప్లాట్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వ నిబంధనలతో ఉన్న ప్లాట్స్ విషయంలో ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. నగర శివారులో నివాస గృహాలు తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులతో నగరానికి మరింతగా గుర్తింపు వచ్చింది. ఈ ఏరియాల్లో నివాసాల కోసం ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. గతం కంటే కూడా ఇప్పుడు రియల్ రంగానికి మంచి ఆదరణ ఉన్నది.
– బిలాల్ ఉస్మాన్, ఉస్మాన్ అసోసియేట్స్, కన్స్ట్రక్షన్
నగరం నలువైపులా విస్తరణ
కరీంనగర్ ప్రస్తుతం అన్ని వైపులా విస్తరిస్తున్నది. నగరాన్ని ఆనుకొని ఉన్న కొత్తపల్లి మున్సిపాలిటీ సమీపం దాకా కాలనీలు వెలుస్తున్నాయి. అలాగే హైదరాబాద్ రోడ్డు, పెద్దపల్లి రోడ్డు, బొమ్మకల్, మంచిర్యాల రోడ్డులో నగునూర్ శివారు వరకు, జగిత్యాల, సిరిసిల్ల రోడ్డులో అయితే కాకతీయ కెనాల్ దాటి మరీ నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. ఇలా నగరం నలువైపులా విస్తరిస్తుండడం, వాటికి అనుగుణంగా రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. నిమిషాల వ్యవధిలోనే నగరం నడ్డిబొడ్డుకు చేరుకునే అవకాశాలు పెరిగాయి. దీంతో శివారుల్లో నూతనంగా నిర్మాణాల్లో వేగం పెరిగింది. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం ఉండడంతో ప్రజలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు శివారు గ్రామాల్లో నివాస స్థలాలకు డిమాండ్ ఎక్కువగానే వస్తుంది.
శివారు ప్రాంతాల్లో అందమైన నిర్మాణాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా కరీంనగర్‌లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రోడ్ల అభివృద్ధితో క్షణాల్లోనే నగరానికి చేరుకునే అవకాశం ఏర్పడింది. మరోవైపు శివారు ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. విశాలమైన స్థలాలు ఉండాలన్న ఆలోచనతోనే ప్రజలు ఈ ఏరియాలవైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇండ్ల విషయంలోనూ ఆధునిక సదుపాయాలు, సౌకర్యాలను కోరుకుంటున్నారు. ఇండ్లు నిర్మాణాలు ఆకర్షణీయంగా ఉండేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడడం లేదు. దీంతో శివారు ప్రాంతాల్లో అత్యంత సుందరంగా ఇండ్ల నిర్మాణాలు సాగుతున్నాయి.
– కొత్త జయపాల్‌రెడ్డి,మైత్రి గ్రూప్స్ చైర్మన్
దేశంలోనే మంచి గుర్తింపు
మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్స్‌తోపాటు మెడికల్ కాలేజీ కానుండడంతో కరీంనగర్ దేశంలోనే మంచి గుర్తింపు పొందింది. దీంతోపాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నది. ఓవైపు నగర సమీపంలోనే గ్రామీణ వాతావరణం ఉండడం, మరోవైపు ఆధునిక సదుపాయాలు ఉండడంతో వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు కూడా ఇక్కడే ఇండ్లు నిర్మించుకునేందుకు ఇష్టపడుతున్నారు. మెట్రో పాలిటన్ సిటీల్లోని అన్ని సదుపాయాలు, షాపింగ్ మాల్స్ అందుబాటులో ఉండడంతో ఆసక్తి చూపుతున్నారు. ఆయా నగరాల్లోని ట్రాఫిక్‌ను తప్పించుకోవచ్చని భావించి ఇక్కడకు వస్తున్నారు. అలాగే విద్యుత్ వినియోగంలోనూ పర్యావరణ హితమైన సోలార్ వాహనాలవైపు ఆసక్తి చూపుతున్నారు.
– కోడూరి పర్శరాం గౌడ్, కేకే ఎంటర్ప్రైజెస్ సోలార్ సొల్యూషన్స్
పెద్ద నగరాలకు దీటుగా డెవలప్మెంట్
మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా కరీంనగర్ డెవలప్ అయింది. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కరీంనగర్లో నివాసం ఉండేందుకు ముందుకొస్తున్నారు. ము ఖ్యంగా ప్రముఖ విద్యాసంస్థలు ఉండడం, హైదరాబాద్ లాంటి నగరాల స్థాయిలో అందే వైద్యం ఇక్కడ అందుబాటులోకి రావడం, ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు అవుతుండడంతో గ్రామీణ ప్రజలు నగరంలో ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో నగర శివారుల్లోనూ మంచి డిమాండ్ వస్తుంది. అలాగే నగరంలోని అన్ని రోడ్లు కూడా సుందరంగా మారాయి. ఎక్కడి నుంచి ఎక్కడైనా నిమిషాల వ్యవధిలో వెళ్లే వీలుగా రోడ్లు అభివృద్ధి అయ్యాయి.
మెరుగవుతున్న సౌకర్యాలు
నగరంలో ప్రజల అవసరాలకు తగ్గట్టు అనేక మౌలిక సదుపాయాలు సమకూరుతున్నాయి. గల్లీగల్లీకి రోడ్లు మెరగవుతున్నాయి. ఇంటింటికీ తాగునీరు అందుతున్నది. వీటితోపాటు నూతనంగా ఏర్పాటవుతున్న శివారు కాలనీల్లోనూ ప్రతి రోజూ మంచినీరు సరఫరా కోసం 12 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా ఎక్కడికక్కడే కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లు ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుతం కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట, కిసాన్‌నగర్, పద్మనగర్, కాశ్మీర్‌గడ్డ ప్రాంతాల్లోనూ నాలుగు కూరగాయలు, మాంసం, చికెన్, చేపలు, పూలు, పండ్ల కోసం సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో నగరం రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వేగంగా నగరీకరణను సొంతం చేసుకుంటున్నది.
ఈజీ లీవింగ్ నగరాల్లో భేష్..
జనాభాను అనుసరించి పారిశుధ్యం, క్లీనింగ్, లీవింగ్ తదితర వాటిల్లో దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల మధ్య ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్, సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్, ఈజీ లివీంగ్ పేర్లతో పోటీలను కేంద్రం నిర్వహిస్తున్నది. వీటిన్నింటిలోనూ కరీంనగర్ నగరపాలక సంస్థ తన స్థానాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూనే ఉన్నది. ముఖ్యంగా మూడేళ్ల కిత్రం కేంద్రం ప్రకటించిన ఈజీ లీవింగ్ నగరాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానం, దక్షిణ భారత దేశంలో మూడో స్థానం సాధించింది. అలాగే గతేడాది ప్రకటించిన సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్‌లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి నగదు పురస్కారాన్ని అందుకున్నది. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ ఏటా తన ర్యాంకును మెరుగు పరుచుకుంటూ వందలోపు స్థానాల్లో నిలుస్తున్నది. ఇలా అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడంతో ప్రజలు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
రాష్ట్రంలోనే రెండో నగరం
కరీంనగర్ రాష్ట్రంలోనే రెండో నగరంగా ఎదుగుతున్నది. విద్యా, వైద్య రంగంలో ఇప్పటికే గుర్తింపు వచ్చింది. మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపడ్డాయి. పర్యాటకంగా కూడా నగరాన్ని రాష్ట్రంలో ముందు నిలిపేందుకు పనులు సాగుతున్నాయి. నగర శివార్లలో అభివృద్ధితోపాటు పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతుండడంతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నది. ఇలాంటి నగరానికి వచ్చేందుకు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కాలుష్యం ఎక్కువగా లేకపోవడం, ట్రాఫిక్ కూడా తక్కువగా ఉండడంతో ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. దీంతో రియల్ రంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
– తుమ్మనపల్లి శ్రీనివాస్‌రావు, డైరెక్టర్ ఎస్ఆర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్