కార్పొరేషన్, నవంబర్ 21: చౌరస్తాల అభివృద్ధి, కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ పనుల పూర్తితో ఏడాదిలోగా కరీంనగర్ తెలంగాణలోనే సుందర నగరంగా మారుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సో మవారం కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి పనులు, ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో అభివృద్ధి పనులకు అంతరాయం కలుగకుండా టవర్లు, స్తంభాల తొలగింపు పూర్తి చేయాలన్నారు. ఐదేళ్ల వరకు ఎలాంటి మరమ్మతు చేపట్టనవసరం లేకుండా నాణ్యాతా ప్రమాణాలతో రోడ్లను నిర్మించాలని సూచించారు. కరీంనగర్లో 14 ప్రాంతాల్లో చౌరస్తాలను సుందరీకరిస్తున్నామని, ఇప్పటికే మూడుచోట్ల పనులను ప్రారంభించామని పేర్కొన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని చెప్పారు. అధికారులు ధాన్యం కొనుగోళ్లను ఆన్లైన్ చేయడమే గాకుండా వెంట వెంటనే రైతుల ఖాతాల్లో నగ దు జమయ్యేలా చూడాలని కోరారు. జిల్లాలో రైతులను ఆయిల్‌పామ్ సాగు దిశగా ప్రోత్సహించాలన్నారు. సాగు చేసే రైతులకు రుణాలు ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఇంటిగ్రేటేడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీ హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.