కొత్తపల్లి, నవంబర్ 21 : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఆటలపోటీలు ఉల్లాసంగా సాగాయి. దివ్యాంగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. సాధారణ క్రీడాకారులకు ఏ మాత్రం తీసిపోని విధంగా సాగాయి. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధులశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీల కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దివ్యాంగ విద్యార్థులతో కలిసి బెలూన్లు, పావురాలు ఎగురవేశారు. ఆ తర్వాత జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. రేకుర్తిలోని ప్రభుత్వ అంధుల పాఠశాల, ఎల్ఎండీ కాలనీలోని మానసిక వికలాంగుల పాఠశాలతోపాటు జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కేంద్రాల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పూర్తి అంధత్వం, పాక్షిక అంధత్వం, శారీరక లోపాలు, పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నవారిని పలు విభాగాలుగా విభజించారు.
సీనియర్స్, జూనియర్స్ కేటగిరీల వారీగా పోటీలు పెట్టారు. 100, 200 మీటర్ల పరుగు పందెం, జావెలిన్ త్రో, షాట్‌ఫుట్, క్యారమ్స్, చెస్, త్రీ వీలర్స్ సైకిల్ గేమ్స్ నిర్వహించారు. ప్రతిభ చాటిన వారిని త్వరలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి కనకం సమ్మయ్య, పీఈటీలు పీ శ్రీనివాస్, శ్రీలక్ష్మీ, రేణుక, హనుమంతు, రేణుక పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అంధ, బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు గేయాలు, మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్‌రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా సంక్షేమ అధికారి సబితాకుమారి, డీఎంహెచ్‌వో జువేరియా, అంధుల పాఠశాల ప్రిన్సిపాల్ నర్మద, లయన్స్‌క్లబ్ అధ్యక్షులు పెద్ది విద్యాసాగర్, కార్యదర్శి మెతుకు సత్యం తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి కృషి
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తున్నది. వారి అభివృద్ధికి పలు పథకాలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తున్నది. దివ్యాంగులకు పింఛన్‌తోపాటు అనేక సదుపాయాలను కల్పించింది. వికలాంగులకు వివాహ ప్రోత్సాహక బహుమతి ఇస్తున్నాం. స్వయంకృషితో జీవించాలనుకునే వారికి పూర్తి సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తున్నాం. అదే విధంగా చదువుకొనే విద్యార్థులకు ల్యాప్‌టాప్, రెట్రో ఫిట్టెడ్ మోటార్ వెహికల్ అందిస్తున్నాం. శారీరక వికలాంగుల కోసం బ్యాటరీ సైకిల్, బ్యాటరీ వీల్‌చైర్, వినికిడి యంత్రాలను సమకూరుస్తున్నాం. చదువుకొనే వారికోసం ప్రత్యేక పాఠశాలలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి.
– మంత్రి గంగుల కమలాకర్