హుజూరాబాద్‌టౌన్, ఫిబ్రవరి 6: హుజూరాబాద్ ప్రాంత నిరుపేదల కల సాకారం కాబోతున్నది. మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు చెందిన అర్హులైన వారి నుంచి నాలుగు రోజులుగా డబుల్ బెడ్రూంల కోసం రెవెన్యూ అధికారులు బల్దియా వద్ద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రేపటితో ఈ దరఖాస్తుల స్వీకరణ ముగియనుండడంతో నిరుపేదలు డబుల్ బెడ్రూం ఇండ్లపై ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ మొదటి రోజు 456, రెండో రోజు 528, మూడో రోజు 484, నాలుగోరోజైన ఆదివారం 23 దరఖాస్తులు వచ్చాయి. సోమవారంతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన అర్హులను గుర్తించి డబుల్ బె డ్రూంలు ఇవ్వాలని ఆదేశించగా హుజూరాబాద్ బల్దియా పరిధిలో గణేశ్‌నగర్ వద్ద ఆరువందల డబుల్ బెడ్రూంలను ప్రభుత్వం నిర్మించింది. దీంతో పాలకవర్గ సభ్యులు, అధికారులు కలిసి అర్హులను గుర్తించే పనిలో బిజీ అయ్యారు. దరఖాస్తులను పరిశీలించి స్థానికులై అన్ని అర్హతలున్న వారిని గుర్తించి డబుల్ బెడ్రూం ఇండ్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ప్రభుత్వ నిబంధనలనునుసరించి అందజేయనున్నారు. గత రెండు, మూడేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల అప్పగింతకు సమయం దగ్గర పడడంతో వాటిపై ఆశలు పెట్టుకున్న అర్హులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. కొందరు దళారులు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దళారులను నమ్మి నిజమైన అర్హులు నష్టపోవద్దని, ప్రభుత్వమే అర్హులకు డబుల్బెడ్రూం లను నిబంధనల ప్రకారం గుర్తించి అందిస్తుందని అధికారులు సూచిస్తున్నారు.