ఇంజపురి అంజి అందరిలా కాదు.. విధిని ఎదురించిన ఓ గ్రామీణ ఆవిష్కర్త! చిన్నతనంలో నోటికి పక్షవాతం వచ్చి కొన్నాళ్లు మాటలేని.. ఐదో తరగతిలోనే చదువుకు దూరమైన లోకల్ సైంటిస్ట్! తండ్రి వెంట పొలానికి వెళ్లి రైతుల కష్టాలను కండ్లారా చూసి చలించిపోయి, అదే ఆలోచనలతో ఎన్నో ప్రయోగాలకు రూపమిచ్చిన ఓ ఔత్సాహిక శాస్త్రవేత్త! రైతన్నకు ఉపయోగపడే వైల్డ్ బోర్ అలారం, మొబైల్ మోటర్ కంట్రోలర్, ఓపెన్ వెల్ మోటర్ కంట్రోల్ సిస్టంతోపాటు వాటర్ ట్యాంక్ ఓవర్ ఫ్లో అలారం, ఆటో ఆన్ఆఫ్ సిస్టం, హ్యూమన్ హైడ్ కంట్రోల్ సిస్టం, సోలార్ స్ట్రీట్ లైట్‌ను ఆవిష్కరించిన విజేత! ప్రస్తుతం మరో పది మందికి ఉపాధి చూపుతున్న స్ఫూర్తిదాత!
వెల్గటూర్, నవంబర్ 19 : కిషన్‌రావుపేటకు చెందిన ఇంజపురి పోసవ్వ-దుర్గయ్యకు ముగ్గురు సంతానం. అందులో రెండో కొడుకు అంజీ. వారికున్న ఎకరంలో వ్యవసాయం చేసుకుంటూ, ఇతర కూలీ పనులు చేసుకుంటూ ముగ్గురిని కూడా కొంత వరకు చదివించాడు దుర్గయ్య. కానీ, అంజీ 5వ తరగతి చదువుతున్న సమయంలో పక్షవాతం వచ్చింది. కోలుకున్నాక కూడా సరిగా మాటలు రాకపోవడంతో చదువును మధ్యలో మానేశాడు. కొన్నాళ్ల తర్వాత మాటలు వచ్చినా.. అప్పటికే నాన్నతోపాటు పొలం పనులకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. అక్కడ రైతులు పడుతున్న కష్టాలను కళ్లారా చూసి, ఏదైనా చేసి వారికి ఉపయోగపడాలని నిశ్చయించుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా పాత వస్తువులను విప్పడం వాటి పని తీరునూ పరిశీలించడమే పనిగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి కొత్త వస్తువులను తయారు చేస్తున్నాడు. అంజికి వివాహమైంది. కొడుకు విష్ణువర్ధన్ (14), బిడ్డ హర్షిత (12) ఉన్నారు. భార్య స్వప్న సహకారంతో పలు నూతన ఆవిష్కరణలు చేస్తున్నాడు.
నాకు చిన్నతనంలో పక్షవాతం రావడంతో ఐదో తరగతిలోనే చదువు మానేసిన. నాన్నతో పొలం పనులకు వెళ్లిన. నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి తయారు చేయడం అలవాటు. కానీ, ఏదో ఒక రోజు నలుగురికి ఉపయోగ పడేది తయారు చేస్తానని బలమైన సంకల్పం ఉండేది. 2007 నుంచి రైతులు పడుతున్న విద్యుత్ కష్టాలను చూసి మోటర్ ఆటోమెటిక్ ఆన్ఆఫ్ సిస్టం తయారు చేసిన. తర్వాత రైతులకు ఉపయోగపడే వస్తువులను తయారు చేసి ప్రదర్శనలు ఇవ్వడంతో ఆర్డర్లు పెరిగినయ్. దీంతో నేను హైదరాబాద్, బెంగుళూర్ లాంటి నగరాల నుంచి మెటీరియల్ తెప్పిస్తున్న. పది మందిని పెట్టుకొని వారికి శిక్షణ ఇస్తూ తయారు చేయిస్తున్న. దీంతో నేను పది మందికి ఉపాధి కల్పిస్తున్నానని సంతృప్తినిస్తంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూనే వ్యాపారాన్ని విస్తరిస్త.
– ఇంజపూరి అంజి
చిన్నతనం నుంచి పాత వస్తువులను విప్పడం వాటి పనితీరును పరిశీలించడం అంజికి అలవాటైంది. పని చేయని రేడియో, టేప్ రికార్డులను విప్పి వాటిలో మోటరు ఎలా పని చేస్తుంది? రేడియోలో మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని నిశితంగా పరిశీలిస్తూ ప్రయోగాలను మొదలు పెట్టాడు. ఏదో రకమైనా వస్తువును తయారు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు పది రకాల వస్తువులను తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నాడు. తాను తయారు చేసిన పది రకాలకుపైగా వస్తువులను తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రదర్శించి నిర్వాహకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. గత నెలలో హైదరాబాద్‌లో ప్రపంచ క్రియేటివిటీ, ఇన్నోవేషన్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ చేతుల మీదుగా ప్రభుత్వ ప్రోత్సాహం కింద 2 లక్షల చెక్కును అందుకున్నాడు. గత అక్టోబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్ సెల్ ద్వారా నూతన ఆవిష్కర్తలకు పెట్టుబడులను ఆహ్వానించగా, అంజి ఆవిష్కరించిన వస్తువులను మార్కెట్లోని విడుదల చేయడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీ, వరంగల్‌లోని ఎన్ఐటీ, సీఎమ్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, గతేడాది కర్నూల్లో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయదారుల సదస్సులో ప్రదర్శనలు ఇచ్చి నిర్వాహకుల నుంచి ప్రశంసలు పొందాడు.
ఇప్పటి వరకు రైతుల కోసం అంజి పలు రకాల పరికరాలను తయారు చేశాడు. వైల్డ్ బోర్ అలారం, మొబైల్ మోటర్ కంట్రోలర్, ఓపెన్ వెల్ మోటర్ కంట్రోల్ సిస్టం, వాటర్ ట్యాంక్ ఓవర్ ఫ్లో అలారం, ఆటో ఆఫ్ సిస్టం, ఆటో ఆన్ ఆఫ్ సిస్టం, హ్యూమన్ హైడ్ కంట్రోల్ సిస్టం, సోలార్ స్ట్రీట్ లైట్ తదితర వస్తువులను తయారు చేశాడు.
ఈ పరికరాన్ని పంట చేలల్లో బిగించి అడవి జంతువుల బారి నుంచి రాత్రి పూట పంటలను రక్షించుకోవచ్చు. వివిధ రకాల క్రూర మృగాల అరుపుల శబ్దాలు ఆటోమేటిక్‌గా ప్రతి 5 నిమిషాల వ్యవధితో ఒక్కోసారి ఒక్కో రకమైన జంతువు అరుపుల శబ్దం చేస్తుంది. పులి, సింహం, ఏనుగు, కుక్క మొదలైనా జంతువుల అరుపులు రావడంతో వన్యప్రాణులు వచ్చే అవకాశం ఉండదు.
రైతులు వారి పంట చేనులో వ్యవసాయ బావి/ బోర్ వద్ద విద్యుత్ మోటర్ స్టార్టర్ బాక్సులో ఒక ప్రత్యేకమైన పరికరంలో సిమ్ కార్డును అమర్చాలి. ఆ నంబర్‌కు కనెక్ట్ చేయబడిన నంబర్ నుంచి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆన్ అని ఎస్ఎంఎస్ పంపిస్తే ఆన్ అవుతుంది. ఆఫ్ అని మెసేజ్ చేస్తే ఆఫ్ అవుతుంది. విద్యుత్ పోయినా, వచ్చినా మనకు మేసేజ్ రూపంలో తెలియజేస్తుంది. దీంతో రైతులు ప్రతి సారి పొలం వద్దకు వెళ్లి ఆన్ఆఫ్ చేయడం తప్పుతుంది.
రైతులు వ్యవసాయ బావి వద్ద మోటర్ స్టార్టర్కు ఒక ప్రత్యేకమైన పరికరాన్ని అమర్చడంతో నీరు అయిపోగానే మోటర్ ఆఫ్ అవు తుంది. మళ్లీ బావిలో నీరు ఊరగానే మోటర్ ఆన్ అవుతుంది.
స్ట్రీట్ లైట్ ఆటోమెటిక్ సిస్టం ద్వారా 100 నుంచి 150 విద్యుత్ బల్బులు ఆటోమెటిక్‌గా రాత్రి కాగానే వెలగడం, ఉదయం సూర్యుడి వెలుతురు రాగానే ఆఫ్ కావడం జరుగుతుంది. ఈ సిస్టంలో ఒక సెన్సార్‌ను అమర్చడంతో వాతావరణంలోని వెలుతురును గ్రహించి పని చేస్తుంది.
నాకు పొలం పనులు రాక ఇంటి దగ్గరనే ఉండగా అంజి సారు పిలిచి పనిచ్చాడు. ఎలా తయారు చేయాలో నేర్పి రోజుకు 200 ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటి దగ్గరే నాకు పని దొరుకుతున్నది.
– మేర్గు గీత. కూలీ(కిషన్రావుపేట)