చొప్పదండి, నవంబర్ 19: మండలంలోని మంగళపల్లిలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్వచ్ఛతా రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెల్మ నాగిరెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ప్రాథమిక పాఠశాల నుంచి ప్రారంభమైన స్వచ్ఛత రన్ గ్రామంలోని పలు వీధుల గుండా తీశారు. అంతకుముందు గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ వెల్మ విజయలక్ష్మి-శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ పెద్దెల్లి సురేశ్, ప్రధానోపాధ్యాయుడు బిజిలి కనకయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. కొలిమికుంటలో పాఠశాల విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. సర్పంచ్ తాళ్లపల్లి సుజాత-శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మరుగుదొడ్డి వినియోగించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో ఐసీపీఎస్ సోషల్ వర్కర్ కవితాదేవి, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, అంగన్వాడీ టీచర్లు మల్లీశ్వరి, లావణ్య, సీఏ గంగ, తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, నవంబర్ 19: మండలంలోని కురిక్యాల, బూరుగుపల్లి, గంగాధర, గర్శకుర్తి, మల్లాపూర్ గ్రామాల్లో గ్రామస్తులకు మరుగుదొడ్ల వాడకంపై అవగాహన కల్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన ర్యాలీలు నిర్వహించి, గ్రామ కూడళ్లలో ప్రతిజ్ఞ చేశారు. ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీవో జనార్దన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, సర్పంచులు మేచినేని నవీన్‌రావు, మడ్లపెల్లి గంగాధర్, అలువాల నాగలక్ష్మి, ఆకుల శంకరయ్య, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రామడుగు, నవంబర్ 19: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉన్న మరుగుదొడ్డికి సర్పంచ్ పంజాల ప్రమీల-జగన్మోహన్గౌడ్ ఆధ్వర్యంలో రంగులు వేయించి, గౌరవ గృహంగా ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి పోచమ్మవాడలోని బస్టాప్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ తీశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ కలిగేటి కవిత మాట్లాడుతూ, మండల ప్రజలంతా స్వచ్ఛతను పాటించాలన్నారు. యునిసెఫ్ ఆధ్వర్యంలో మరుగుదొడ్డి వినియోగించుకుంటామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కాగా, యునిసెఫ్ నిధులతో వెలిచాల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో, రుద్రారం, శ్రీరాములపల్లి, కొక్కెరకుంట, వెదిర గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో రాజశేఖర్, యునిసెఫ్ క్లస్టర్ ఫెసిలిటేటర్ తాళ్ల వెంకటేశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద, ఏపీఎం ప్రభాకర్, ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, నవంబర్ 19: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్‌గౌడ్ సూచించారు. ఎలగందుల గ్రామంలో స్వచ్ఛతా రన్ నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎంపీపీతో పాటు సర్పంచ్ షర్మిల-ప్రకాశ్, ఎంపీటీసీ మంద రమేశ్‌గౌడ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, గ్రామస్తులంతా మరుగుదొడ్లను వినియోగించాలని సూచించారు. ఇండ్లల్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసి గ్రామ పంచాయతీ సిబ్బంది తీసుకువచ్చే వాహనంలో వేయాలని కోరారు. ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీవో ఎం శ్రీనివాస్, ఉప సర్పంచ్ బోనాల నరేశ్, పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ టాయ్లెట్లను చైర్మన్ రుద్ర రాజు పరిశీలించారు. టాయ్లెట్లు శుభ్రంగా ఉండడంతో పాటు నీటి నిర్వహణ, తదితర సౌకర్యాలను పరిశీలించి జవాన్‌ను అభినందించారు.
కరీంనగర్ రూరల్, నవంబర్ 19: కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్ గ్రామంలో సర్పంచ్ ఊరడి మంజుల ఆధ్వర్యంలో మహిళా సంఘాలు సభ్యులు స్వచ్ఛతా రన్ నిర్వహించారు. క్రీడా ప్రాంగణంలో మానహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఉపసర్పంచ్ ఆరె శ్రీకాంత్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు పద్మ, రాధ, పంచాయతీ కార్యదర్శి హిదాయితుల్లా పాల్గొన్నారు.