రాజన్న సిరిసిల్ల, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనపై దృష్టిపెట్టాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. రాజన్నసిరిసిల్ల జడ్పీ ఆఫీస్ కాన్ఫరెన్స్హాల్లో శనివారం చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అధ్యక్షతన నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్కారు రాయితీలను వినియోగించుకునేలా ప్రోత్సహించాలని నిర్దేశించారు.
ఉమ్మడి రాష్ట్రంలో రూ. లక్ష రుణం కోసం ప్రజలు వెంపర్లాడాల్సి వచ్చేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాలకు కొత్త యూనిట్ల స్థాపనకు ఆర్థిక చేయూతనిస్తున్నదని చెప్పారు. దళితబంధు ద్వారా నిరుపేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదన్నారు. ధాన్యం కొనుగోలు నిల్వల ఏర్పాట్లపై ముందుగానే ఒక అవగాహనకు రావాలని అధికారులకు సూచించారు. కేంద్రం మార్కెట్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. మత్స్య కారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. మన ఊరు మనబడి కింద పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలని, మిల్లుల వద్ద ధాన్యం ఆన్లోడింగ్ వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో పాడి అభివృద్ధికి మంచి అవకాశాలున్నందున పాడిగెదెల యూనిట్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ అధికారులు ప్రతి వారం తమ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శించాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జడ్పీటీసీలు కత్తెర పాక ఉమ, గట్ల మీనయ్య, నాగంకుమార్, మ్యాకల రవి, చీటి లక్ష్మణ్‌రావు, కొమిరిశెట్టి విజయ, ఏషవాణీ,కోఆప్షన్ సభ్యులు అహ్మద్, సీఈవో గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.