విద్యానగర్, ఫిబ్రవరి 6: కరీంనగర్ మెడికవర్ దవాఖానలో అత్యంత అరుదైన కాంప్లెక్స్ వ్యాల్ గస్ నీ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆర్థోపెడిక్ సర్జన్ సాయిఫణిచంద్ర తెలిపారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మాత్రమే చేసే ఈ మోకాలి శస్త్రచికిత్సను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మొదట తమ దవాఖానలో నిర్వహించినట్లు తెలిపారు. ఆదివారం దవాఖానలో శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా ఇందారానికి చెందిన 55 ఏండ్ల బకమ్మకు వంశపారంపర్యంగా వచ్చే సమస్య కారణంగా కుడి మోకాలు 25 డిగ్రీలు వంకరగా మారిందని తెలిపారు. దీంతో 15 ఏండ్లుగా వంకరపోయి రెండు మోకాళ్లు తాకుతుండడంతో నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడేదని పేర్కొన్నారు. చికిత్స కోసం ఎన్ని దవాఖానలు తిరిగినా ఎకడా నయం కాకపోవడంతో గత నెల 18వ తేదీన తమ దవాఖానకు వచ్చారని తెలిపారు. నడిచేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్న బకమ్మకు సీటీ సాన్ చేశామని పేర్కొన్నారు. కుడి మోకాలు 25 డిగ్రీలు, ఎడమ మోకాలు 10 డిగ్రీలు వంకరగా ఉన్నట్లు గుర్తించామని, దీనిని వ్యాల్ గస్ ఓస్టియో ఆర్థరైటిస్ అంటారని తెలిపారు. ఎడమ మోకాలితో పెద్దగా ఇబ్బంది లేనందున 25 డిగ్రీలు వంకరగా ఉన్న కుడి మోకాలును మామూలుగా చేసేందుకు వ్యాల్ గస్ గ్రేడ్ – 3 శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా మోకాలు రీప్లేస్ మెంట్ చేసినట్లు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స అనంతరం బకమ్మ సాధారణంగా నడుస్తున్నదని వెల్లడించారు. కాగా, తాము 15 ఏండ్లుగా వివి ధ దవాఖానలకు వెళ్లినప్పటికీ ఎవరూ ఆపరేషన్‌కు ముందుకు రాలేదని బక్కమ్మ బంధువులు తెలిపారు. తనకు ఆపరేషన్ చేసి వంకరగా ఉన్న కాలును సరిచేసిన మెడికవర్ వైద్య బృందానికి బకమ్మ, ఆమె బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. దవాఖాన అడ్మినిస్ట్రేటర్ గుర్రం కిరణ్, అనిస్తీషియా డాక్టర్ మహేశ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ స్రవంతి పాల్గొన్నారు.