ముస్తాబాద్, ఫిబ్రవరి 6: రాజకీయ కురువృద్ధుడు, ఓటమెరుగని నేతగా గుర్తింపు పొందిన ఎంపీటీసీల ఫోరం ముస్తాబాద్ మండలాధ్యక్షడు నేవూరి పోచిరెడ్డి (69) ఆదివారం మరణించారు. మూడు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స తీసుకున్నాడు. పరిస్థితి విషమించడంతో శనివారం కొండాపూర్‌లోని తన నివాసానికి తరలించగా ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రజలందరి చేత పోచన్నగా పిలిపించుకున్న ఆయన మృతితో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకున్నది. మరణవార్త విన్న మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి వ్యక్తిగతంగా పార్టీపరంగా తీరనిలోటని సంతాపం ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు సంతాపం తెలిపారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హుటాహుటిన గ్రామానికి చేరుకొని పోచిరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కు టుంబసభ్యులను పరామర్శించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే మండలంలోని పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పోచిరెడ్డి నివాసానికి తరలివచ్చారు. భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి అభిమాన నేతకు కడసారి నివాళులర్పించారు.
కొండాపూర్కే జీవితం అంకితం..
నేవూరి పోచిరెడ్డిది గంభీరావుపేట.. ముస్తాబాద్ మండలం కొండాపూర్‌కు చెందిన ఆయన బావ బాల్రెడ్డికి సంతానం లేకపోవడంతో పోచిరెడ్డిని ఐదేండ్ల వయస్సులో దత్తత తీసుకుని పెంచి పెద్దచేశాడు. బాల్‌రెడ్డి రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశాడు. ఆయన వారసుడిగా పోచిరెడ్డి 1979లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే సంవత్సరం తొలిసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1984లోనూ రెండోసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మండల ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. 1989లో గ్రామ సర్పంచ్ స్థానం ఓసీ మహిళకు కేటాయించగా తన భార్య పద్మలతను బరిలోకి దింపి భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. మొదట కాంగ్రెస్‌లో పనిచేసిన ఆయన ఆరేండ్ల క్రితం టీఆర్ఎస్లో చేరారు. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన మంత్రి కేటీఆర్ వేములవాడ రాజన్న ఆలయ డైరెక్టర్‌గా నియమించారు. 2006లో కొండాపూర్ నుంచి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లో మరోమారు ఎంపీటీసీగా గెలిచారు. ప్రస్తుతం ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 42 ఏండ్ల తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఓటమెరుగని నేతగా ఖ్యాతి దక్కించుకున్నారు.
అందరితో ఆప్యాయంగా..
పోచిరెడ్డి చిన్న పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు అందరితో ఆప్యాయంగా ఉండేవారు. వారికి ఏ ఆపద వచ్చినా ముందుండి ఆదుకొనేవారు. ప్రతిఒక్కరి చేత పోచన్నగా పిలుపించుకున్న ఆయన మరణంతో గ్రామం దుఃఖసాగరంలో మునిగిపోయింది. పార్టీలకతీతంగా ఆయనకు అభిమానులు ఉండేవారు. ప్రజాసేవలో నిమగ్నమై తన ఆస్తులను సైతం అమ్ముకున్నారు. మూడు నెలల క్రితం బ్లడ్ ప్రెషర్ పెరగడంతో పాటు పక్షవాతం బారిన పడ్డారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చేర్పించి చికిత్స అందించినా ఆరోగ్యం కుదుటపడలేదు. పరిస్థితి విషమించడంతో శనివారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆదివారం కన్నుమూశారు. ఆయనకు బిడ్డ ప్రవళిక, కొడుకు బాల్‌రెడ్డి, భార్య పద్మలత ఉన్నారు. కాగా సోమవారం పోచిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నామని బంధువులు తెలిపారు.