నిషేధిత జాబితా (పీవోబీ)లో చేరిన పట్టా భూముల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం నడుం బిగించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు వచ్చిన ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగింది. వారం నుంచి పెద్దపల్లి కలెక్టరేట్లో మకాం వేసి గ్రామం యూనిట్‌గా లిస్టులను వడపోస్తున్నది. కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ జిల్లాలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఇతర సిబ్బందితో రికార్డులను తెప్పించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి, త్వరలోనే గ్రామాల వారీగా రెవెన్యూ బృందాలను పంపించేందుకు సిద్ధమవుతున్నారు.
పెద్దపల్లి, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): భూనిషేధిత జాబితా(పీఓబీ- ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్ రిజిస్టర్) సమస్యలు పరిష్కరించాని సర్కారు నిర్ణయించింది. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని అన్ని రకాల భూముల రికార్డులు, క్షేత్ర స్థాయిలో భూములను పరిశీలించాలని ఇటీవల సీఎం కేసీఆర్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన రెవెన్యూ యంత్రాంగం ఏవైతే చిన్న చిన్న కారణాలతో పీఓబీ జాబితాలో ఉండి భూ హక్కు దారులు పడుతున్న ఇబ్బందులను దూరం చేసేందుకు చర్యలు చేపడుతున్నది. జిల్లాలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు, వీఆర్ఏలతో ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రికార్డులను తెప్పించి ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పీఓబీ జాబితాలో 5వేల సర్వేనంబర్లలోని భూములున్నాయని, ఎక్కువగా ధర్మారం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల్లోనే సమస్యలున్నట్లు గుర్తించింది.
నిషేధిత జాబితాలో 5వేల సర్వే నంబర్లు..
పీఓబీలో ప్రధానంగా కోర్టు కేసు భూములు, అసైన్డ్భూములుగా నమోదై రికార్డుల్లో పట్టాలుగా మారినవి, మిగులు భూముల హక్కుల సమస్యలు, ఇనాం, ఎండోమెంట్, వక్ఫ్, భూధాన్ భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 10వేల సర్వే నంబర్లలోని భూములు నిషేధిత జాబితాలో ఉండగా, ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్ ద్వారా వాటి సంఖ్య 5వేలకు తగ్గింది. అయితే ఈ 5వేల సర్వే నంబర్లకు సంబంధించిన భూములపై పట్టాదారులకే హక్కులు ఉన్నప్పటికీ, రైతు బంధు పొందుతున్నప్పటికీ, క్రయ విక్రయాల సమయంలో మాత్రం పీఓబీ జాబితా కారణంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు ఒక సర్వే నంబర్లో వందల ఎకరాల ప్రైవేటు పట్టా భూములున్నాయి. అయితే అందులో కనీసం ఒక ఐదారుగుంటలు ప్రభుత్వ భూమి ఉంటే ఆ నంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో ఉంచారు. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.
పత్రాల అనంతరం క్షేత్ర స్థాయి పరిశీలన..
జిల్లా వ్యాప్తంగా 14మండలాల్లోని 215 రెవెన్యూ గ్రామాల్లో దాదాపు 5వేల సర్వేనంబర్లలోని భూముల పీఓబీ సమస్య పరిష్కారానికి ప్రస్తుతం అన్ని రకాల పాత, కొత్త డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐ, వీఆర్ఓ, వీఆర్ఏలు, ఇతర రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి ధరణి ఆపరేటర్ సమక్షంలో పాత రికార్డులన్నీ తిరగేస్తున్నారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని రికార్డులను వేరు చేసి అనుబంధ పత్రాలను, రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత ఏవైతే జాబితా నుంచి తొలగించేందుకు అవకాశం ఉంటుందో వాటన్నింటి రికార్డులను అందుబాటులో పెట్టుకొని త్వరలోనే క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు వెళ్లనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమై ఇప్పటికే వారం రోజులు కాగా మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది.
రెండు మూడు రోజుల్లో పరిశీలన పూర్తి..
కొద్దిరోజులుగా జిల్లాలోని రెవెన్యూ అధికారులందరూ పీఓబీ జాబితాలోని భూములకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తున్నారు. వారం రోజులుగా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా రెవెన్యూ యంత్రాంగం అంతా పీఓబీ భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి రెవెన్యూ వివాదాలను పరిష్కరించే కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. రికార్డుల పరిశీలన ప్రక్రియ మరో రెండు, మూడు రోజుల్లో పూర్తి చేస్తాం. ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ముందుకెళ్తాం.
– సర్వే డాక్టర్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి కలెక్టర్