కార్పొరేషన్, నవంబర్ 14: నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి, సుందర నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్ యాదగిరి సునీల్‌రావు పేర్కొన్నారు. నగరంలోని 56వ డివిజన్లో రూ. 16.50 లక్షల వ్యయంతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భాగ్యనగర్, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో మంచినీటి సరఫరా విషయంలో ఇబ్బందులు ఉండేవన్నారు. ఇప్పుడు నగర వ్యాప్తంగా నిత్యం మంచినీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వానకాలంలో వరద నీరు నిలిచి ఉండకుండా డ్రైనేజీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక నిధుల కేటాయింపు, అభివృద్ధి కరీంనగర్‌లోనే జరుగుతోందన్నారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ సహకారంతో నిధులు మంజూరవుతున్నట్లు తెలిపారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్రావు, కో-ఆప్షన్ సభ్యుడు అజిత్‌రావు, మాజీ కార్పొరేటర్ సదానందచారి, నాయకులు, డివిజన్ ప్రజలు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమమే కేసీఆర్ ధేయ్యం
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్‌రావు (సీఐటీయూ మహాసభ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు) పేర్కొన్నారు. నగరంలో డిసెంబర్ 3, 4వ తేదీల్లో నిర్వహించే సీఐటీయూ జిల్లా మహాసభలకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి కార్మికుడుకు ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందుతున్నాడని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులు తమ హక్కులను కోల్పోతున్నారని, ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, ముకుందరెడ్డి, పున్నం రవి పాల్గొన్నారు.