కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 3 : నగరంలోని మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళయింది. ఇందులో భాగంగా 10 రోజుల వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధమైంది. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఆలయ ఈవో పీచర కిషన్ రావు, వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే దేవాలయ పరిసర ప్రాంగణమంతా సుందరంగా ముస్తాబైంది. గతేడాది ఆలయ ప్రాంగణంలో అరంతర్గతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించగా, అందుకు భిన్నంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా తిరుమల తిరుపతికి చెందిన వేద పండితుల ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ, పంచమ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. స్వామి వారి కల్యాణం, పుష్పాభిషేకం, చక్రస్నానం కోసం అమరవీరుల స్తూపం వరకు వేదికను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో నిర్వహించిన శోభాయాత్రలో ఒక గజ వాహనాన్ని ఏర్పాటు చేయగా, ఈ సారి 2 గజ వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు.
మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయం దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఇతర దేవస్థానాలకు భిన్నంగా ఏకశిలపై వెలసిన స్వామికి ఎంతో ప్రాశస్థ్యం ఉన్నది. ప్రస్తుత వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రదేశమంతా ఒకప్పుడు అటవీ ప్రాంతం. ఆనాడు కరీంనగర్ ఎలగందుల ఖిల్లాగా బాసిల్లింది. అటవీ ప్రాంతంలో రాతిపై స్వామివారి మూల విరాట్టు స్వయంగా వెలిసినట్లుగా తెలుస్తున్నది. ఆ సమయంలో ఉన్న ముస్లిం అధికారికి స్వామివారి అనుగ్రహంతో సంతానం కలిగిందని, పంచరాత్ర ఆగమం ప్రకారం ఆలయ నిర్మాణం జరిపించినట్లు పట్టణ పెద్దలు చెబుతున్నారు. కాలక్రమేణా గుడి ప్రాశస్థ్యం పెరుగుతూ వచ్చింది. 1974లో ఆలయ ఆవరణలో త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్‌స్వామి చేతుల మీదుగా శ్రీ విష్ణుమూర్తి స్వామి వేద స్తూప ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత 1990లో ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా ముఖ మండపం, మధ్య మండలం, గర్భాలయం, గరుడాలయాన్ని నిర్మించారు. ఆలయానికి ఉత్తరం వైపున నవగ్రహ మండపాన్ని నిర్మించారు. నైరుతి మూల పెరుగడంతో గణపతి విగ్రహం ప్రతిష్ఠించారు. 1996లో అప్పటి చైర్మన్ చకిలం ఆగయ్య, అధికారులు కలిసి తొమ్మిది రోజులు పూజలు చేసి చక్ర ధ్వజ స్తంభం, గరుడ, నవగ్రహ, గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనుబంధంగా లక్ష్మీనారాయణ ఆలయం నిర్మించారు. నగరం నడి బొడ్డున ఉండడంతో వేంకటేశ్వర కల్యాణం, శ్రీరామనవమి, ఏకాదశి రోజుల్లో దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.
4న శుక్రవారం ఉదయం 8.30 గంటలకు స్వామి వారికి సహస్ర కలశాభిషేకం (1008 కలశాలతో) సాయంత్రం అధ్యయనోత్సవ ప్రారంభం, ప్రబంధ పారాయణం, తీర్థప్రసాదగోష్ఠి, 5న పారాయణం, ప్రబంధ పారాయణం, 6న ప్రబంధ పారాయణం, సాయంత్రం పరమపదోత్సవం ఉంటాయి. 7వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 7న భగత్‌నగర్ అయ్యప్పస్వామి దేవాలయం నుంచి ‘అంకురార్పణ’ పుట్టమన్ను తీసుకువస్తారు. సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షబంధనం, అంకురార్పణ, ధ్వజారోహణ, శేషవాహన సేవ ఉంటాయి. 8న యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ఠ, పూర్ణాహుతి, ధ్వజారోహణ, సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం బేరిపూజా, సహస్రదీపాలంకరణసేవ, ఊంజల్ సేవ, నిత్య పూర్ణాహుతి, బలిహరణ, చంద్రప్రభ వాహన సేవ ఉంటాయి. 9న యాగశాలలో నిత్యహోమం, పూర్ణాహుతి, కల్పవృక్ష వాహన సేవ, బలిహరణం, తీర్థప్రసాదగోష్ఠి ఉంటాయి. సాయంత్రం జ్యోతినగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఎదురోళ్ల ఉత్సవం, అశ్వవాహన, గజవాహన సేవ ఉంటాయి. పద్మావతి అమ్మవారు పద్మశాలీయుల ఇంటి ఆడపడుచు అయినందున తిరుపతి, తిరుచానూరులో జరిగే సంప్రదాయాన్ని అనుసరించి పద్మశాలీ సమాజం ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు, తలంబ్రాలు, సారె సమర్పిస్తారు. 10న యాగశాలలో నిత్య పూర్ణహుతి, అనంతరం తాళ్లపాక స్వామి అన్నమయ్య 12వ తరం వారసులు తిరుమల శ్రీవారి ఆలయ నిత్యకళ్యాణోత్సవం కన్యాదానం కైంకర్యవర్యులు తాళ్ళపాక హరినారాయణ చార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణస్వామి వారి కళ్యాణోత్సవం ఉంటుంది. సాయంత్రం గరుడవాహన సేవ, తీర్థప్రసాదగోష్ఠి నిర్వహిస్తారు. 11న శుక్రవారము యాగశాలలో నిత్య పూర్ణాహుతి, హనుమత్ వాహన సేవ, బలిహరణం, తీర్థప్రసాదగోష్ఠి, సాయంత్రం నిత్య పూర్ణహుతి, సింహవాహన సేవ, బలిహరణ, తీర్థప్రసాదగోష్ఠి ఉంటాయి. 12న శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం పండితులచే సుప్రభాత సేవ, తిరుప్పావడ సేవ, మహా పూర్ణహుతి, చక్రతీర్థం, వసంతోత్సవం, సాయంత్రం పుష్పయాగం, ద్వాదశారాధన, సప్తావర్ణములు, ధ్వజావరోహణ, ఏకాంతసేవ, పండిత సన్మానం, మహదాశీర్వచనం నిర్వహిస్తారు. 13న ఆదివారం సాయంత్రం మార్క్‌ఫెడ్ గ్రౌండ్ నుంచి ‘శోభాయాత్ర’ తాళ్ళపాక హరినారాయణ చార్యులు ఈ శోభాయాత్రతో ఈ ఉత్సవాలు పూర్తవుతాయి. ఈ కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థాన పండితులు శ్రీనివాసాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు చక్రవర్తుల లక్ష్మీనారాయణాచార్యులు, చెన్నోఝల నాగరాజాచార్యులు వైదిక నిర్వహణలో నిర్వహించనున్నారు.
వేంకటేశ్వస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రి గంగుల అక్కడ ఏర్పాట్లను సమీక్షిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు నందెల్లి మహిపాల్, ఆలయ ఈవో పీచర కిషన్ రావు, వ్యవస్థాపక ధర్మకర్తలను, ఉత్సవ కమిటీ నాయకులతో మాట్లాడారు. స్వాగత తోరణం, స్టేజ్, వంటశాల, ప్రసాద కౌంటర్‌ను పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసే గరత్మంతుడి విగ్రహాన్ని పరిశీలించారు. విగ్రహానికి రంగులు అద్ది ఉదయం వరకు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
వేంకటేశ్వర స్వామి ఆలయంలో పంచమ బ్రహ్మోత్సవాలను గతం కంటే ఘనంగా నిర్వహించాలని సంకల్పంతో ముందు సాగుతున్నాం. మొత్తం కార్యక్రమాలను తిరుమల తిరుపతి పండితుల ఆధ్వర్యంలో నిర్వహించేలా రూపకల్పన చేశాం. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయం నుంచి పుట్టమన్ను, జ్యోతినగర్ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎదురుకోలు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కల్యాణం, పుష్పార్చణ కోసం ప్రత్యేకంగా స్టేజ్‌ను అమరవీరుల స్తూపం వరకు ఏర్పాటు చేశాం. ఇదే క్రమంలో నగరం మొత్తం విద్యుత్‌దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి ముస్తాబు చేశాం. రెండు గజరాజులతో శోభాయాత్ర నిర్వహిస్తాం. నగరంతోపాటు చుట్టు పక్కల గ్రామాల వారు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి అసౌకర్యాం కలగకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నాం.
– గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి
పంచమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు, ఏర్పాట్లపై దృష్టి సారించాం. ఉత్సవాలకు దేవాదాయశాఖ తరుపున సేవలందిస్తున్నాం. మంత్రి గంగుల కమలాకర్, పాలకవర్గం సూచనల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతర ఆలయాల సిబ్బందిని వినియోగించుకొని, వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తాం.
– పీచర కిషన్‌రావు, కార్యనిర్వహణాధికారి
బ్రహ్మోత్సవాల్లో పది రోజుల పాటు 1600 మందితో సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ క్రమంలో ఇప్పటికే పలువురికి విధులు కేటాయించాం. 250 మందికి ఒక బ్యాచ్ చొప్పున అన్ని కార్యక్రమాల్లో సేవలందిస్తాం. క్యూలైన్ నుంచి ప్రారంభమై, అన్నదానం, ప్రసాద వితరణ, వాహన సేవ, హోమం, కల్యాణం, చివరి రోజు శోభయాత్రలో సైతం ప్రత్యేకంగా సేవలందించేందుకు భక్తులు ఉత్సాహంగా ఉన్నారు. వారిని సమన్వయం చేస్తూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సేవలందిస్తాం. ఈ సేవ భగవంతుడి సేవగా భావిస్తాం.
– పాలవేడు శ్రీనివాస్, గోవిందపతి శ్రీవారి సేవా సమితి అధ్యక్షుడు