హుజూరాబాద్‌టౌన్, ఫిబ్రవరి 3: కేం ద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపడంపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు హుజూరాబాద్ అంబేదర్ చౌరస్తాలో గురువారం నిరసన వ్యక్తం చేసి ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏడున్నరేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధిలో ఎంతో ప్రగతి సాధించిందని, కానీ అదే ఏడున్నరేళ్ల మోదీ పాలనలో దేశం మతం మత్తులో మూలుగుతూ వెనుకబడిపోతున్నదన్నారు. పీఎం మోదీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకలా అధికారంలో లేని రాష్ట్రాల్లో మరోలా వ్యవహరించారన్నారు. రాష్ట్రాల మధ్య వివక్ష చూపిన మోదీ దేశానికి ప్రధానిగా వ్యవహరించడం లేదని. కేవలం గుజరాత్‌కు మాత్రమే ప్రధానిగా వ్యవహరించిన తీరు దేశ ప్రజలు గమనిస్తున్నారని పేరొన్నారు. ప్రజారంగ సంస్థలను ప్రైవేట్‌కు ధారాదత్తం చేయడం మాని దేశ ప్రజల కోసం పాటుపడాలని హితవుపలికారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను కేటాయించి ప్రధాని తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగంలో 105వ సవరణ చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని తమకు అనుకూలమైన చట్టాలను చేయడాన్ని మాత్రమే సీఎం కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగెం అయిలయ్య, నాయకులు గందె శ్రీనివాస్, మొలుగు పూర్ణచందర్, సురకంటి సదాశివరెడ్డి, బాషబోయిన కుమార్, కొండ్ర నరేశ్, బూసారపు బాబురావు, చందా గాంధీ, మురళీగౌడ్, కొలిపాక రవి, పంజాల హరీశ్‌గౌడ్, కిరణ్‌గౌడ్, ప్రతాపకృష్ణ, మరపెల్లి శ్రీనివాస్, మనోహర్ ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సీపీఎం మానకొండూర్ జోన్ కార్యదర్శి సుంకరి సంపత్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని మార్కెట్ ఏరియా వద్ద సీపీఎం నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం తాజా బడ్జెట్లో అవసరమైన చర్యలు చేపట్టలేదన్నారు. కార్మిక, కర్షక, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా, కేవలం పెట్టుబడి దారుల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టినట్లు ఉందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ అర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో శంకుస్థాపన చేయించి బడ్జెట్లో గుజరాత్ గిఫ్ట్‌సిటీ కేంద్రంగా అంతర్జాతీయ అర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పనిచేస్తున్నదని ప్రకటించడం తెలంగాణ ప్రజలను మోసగించడమే అవుతుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ముప్పు తొలగిపోలేదని అంతర్జాతీయ ఆరోగ్యసంస్థ హెచ్చరికలు జారీచేస్తున్నా దేశంలో కొవిడ్ అత్యవసర సేవలకు కేటాయింపులు లేకపోవడం అందోళన కలిగించే అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ పేదల కడుపులు కొట్టి పెట్టుబడిదారులకు పంచే విధంగా ఉందని విమర్శించారు. కార్యక్రమంలో జోన్ నాయకులు శ్రీరాముల నారాయణ, కుర్ర వెంకటస్వామి, పొలగాని ప్రశాంత్, మొండయ్య, గంగుల కుమార్, రేవెల్లి ఓదయ్య, బాలయ్య, కుర్ర సమ్మయ్య, లోకిని సంపత్, అంజయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.