పెద్దపల్లి టౌన్, నవంబర్ 8: పెద్దపల్లి జిల్లా మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఆధునిక సదుపాయాలతో మరింత అభివృద్ధి చేస్తామని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మంగళవారం జడ్పీ చైర్మన్ సొంత డబ్బుతో 25 ఫ్యాన్లు అందజేశారు. ఫ్యాన్లను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్విచ్ఛాన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా మాతా శిశు సంరక్షణ కేంద్రాలు పనిచేయడంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. సీఏం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక కృషితోనే దవాఖానలు ఆధునికంగా మారాయన్నారు. ప్రభుత్వ దవాఖానలో పేదల వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా ల్యాబ్ నిర్వహణ కోసం 1.5లక్షలు ఖర్చవుతున్నదని, ఈ ల్యాబ్ ఏర్పాటు చేయడంతో ఇప్పటివరకు 23వేల ఉచిత వైద్య పరీక్షలు చేశారని వివరించారు.
దాతలు ముందుకు వచ్చి దవాఖాన అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రతి నెలా తన జీతం నుంచి 10వేలను విరాళంగా ఇస్తునట్లు పుట్ట మధు ప్రకటించారు. ఇక్కడ పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఠాకూర్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బండారు రాంమూర్తి, పెద్దపల్లి ప్యాక్స్ చైర్మన్ మాదిరెడ్డి నర్సింహా రెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శౌరయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజుకుమార్, నాయకులు యెన్నం రవీందర్, కాశిపాక వాసు, కుక్క మనోజ్‌కుమార్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.