జమ్మికుంట రూరల్, ఫిబ్రవరి 3: జల్సాలకు అలవాటు పడిన యువత ఈజీ మనీ కోసం చెడుమార్గాలను ఎంచుకొని చైన్ స్నాచింగ్‌లకు పాలుపడుతున్నారని హుజూరాబాద్ ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. దొంగతనాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలోని ఓ వృద్ధురాలి నుంచి బంగారు గొలుసు అపహరించిన దొంగలను ఏసీపీ, సీఐ రామచంద్రారావు గురువారం రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జనవరి 31న పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న వృద్ధురాలు కర్రె లక్ష్మి ఒంటరిగా ఉండగా ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. గురువారం గాంధీ చౌరస్తాలోని బంగారు షాపుల వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారిని సోదా చేయగా బంగారు గొలుసు దొరకడంతో అదుపులోకి తీసుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా చోరీ చేసిన విషయం ఒప్పుకొన్నారు. వీరిని కొండపర్తి రాజేశ్, గుర్రం శ్రీధర్‌గా గుర్తించారు. రాజేశ్ బీఏ చదవి ప్రైవేట్ కళాశాలలో అకౌంటెంట్‌గా పని చేసి జీతం తక్కువగా ఇస్తున్నారని మానేశాడు. మద్యానికి బానిసైన రాజేశ్ ‘అభిరాం బార్ అండ్ రెస్టారెంట్’లో వెయిటర్‌గా పని చేస్తున్న శ్రీధర్‌తో పరిచయం పెంచుకున్నాడు. వీరిద్దరూ సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నారు. శ్రీధర్ ఇంటి దగ్గరలో వృద్ధురాలు లక్ష్మి ఒంటరిగా ఉండడం గమనించారు. ప్రణాళికా ప్రకారం ఒక రోజు లక్ష్మి మెడలో నుంచి మూడుతులాల బంగారు గొలుసును చోరీ చేశారు. వీటిని అమ్మడానికి నగల షాపుల వద్దకు రాగా పోలీసులకు చిక్కారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక్కడ ఎస్ఐలు రామ్మోహన్, ఎస్ కే యూనిస్, ఏఎస్ఐ రాధాకిషన్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌రావు, రహీం, సాగర్, అమీర్‌పాషా, అనిల్, హోంగార్డులు శ్రీనివాస్, మహేశ్ ఉన్నారు.