హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 30: చిన్న నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏమరపాటుతో కుటుంబాలు చెల్లాచెదరవుతున్నాయి. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై హుజూరాబాద్ పట్టణ సమీంలోనే నిర్లక్ష్యంగా రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా లారీలను నిలిపి ఉంచడంతో వారం రోజుల్లోనే రెండు ప్రాణాలు గాల్లో కలిశాయి. వీరు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
హుజూరాబాద్ మండలం పెద్దపాయ్యపల్లి గ్రామానికి చెందిన తోట మొగిలి(54) ఈ నెల 25న దీపావళి పండుగకు తన కూతురును చూడడానికి హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేటకు ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. పట్టణ సమీపంలోని పరకాల క్రాస్ రోడ్డు వద్ద లారీని నిర్లక్ష్యంగా పార్కు చేయడంతో మొగిలి వెనుక నుంచి ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదే గ్రామానికి చెందిన మణిదీప్(20) సింగాపూర్ కిట్స్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ నెల 29న కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా మందాడిపల్లి వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఇవి రెండు మచ్చుకు మాత్రమే. ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా నిలిపిన వాహనాలను ఢీకొని చాలా మంది మృత్యువాత పడ్డారు. మరి కొందరు గాయాలపాలయ్యారు.
హుజూరాబాద్ సమీపంలోనే ప్రమాదాలు
హుజూరాబాద్ పట్టణం నుంచి వరంగల్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఎక్కువగా వాహనాలు నిలుపుతున్నారు. రోడ్లను ఆనుకుని మెస్‌లు, వైన్ షాపులు ఉండడంతో వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారు. చీకటిపడిన తర్వాత ఎదురుగా వస్తున్న వాహనాల లైట్ ఫోకస్‌కు నిలిపి ఉన్న వాహనాలు కనబడకపోవడంతో అనేకమంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
రోడ్లపై వాహనాలు నిలిపితే చర్యలు
ప్రధాన రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలు నిలిపితే చర్యలు తీసుకుంటాం. మెస్‌ల ముందు రోడ్డుపై లారీలు కానీ, కార్లను నిలిపితే మెస్ యజమానులపై కేసులు నమోదు చేస్తాం. ప్రధాన రహదారులపై వరి ధాన్యం ఆరబోయడంతో రాత్రి పూట ప్రమాదాలు జరుగుతున్నాయి. ధాన్యాన్ని రహదారులపై ఆరవేయవద్దు.
-టౌన్ సీఐ శ్రీనివాస్