జగిత్యాల విద్యానగర్, అక్టోబర్ 29 : జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శ్రీచైతన్య జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ ఫీస్టా హంగామా శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలతో విద్యార్థులు హోరెత్తించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో రాష్ట్ర స్థాయి మారులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ ముసిపట్ల రాజేందర్ సన్మానించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ సెకండియర్ విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మంచి మారులతో రాష్ట్రస్థాయి ర్యాంక్‌లను సాధించాలని సూచించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నేరెళ్ల మల్లేశంగౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని నవ్య బాలికల జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ ఆర్థిక లాభాల కోసం ఆశించకుండా అమ్మాయిల కోసం ప్రత్యేకంగా జూనియర్ కళాశాల నెలకొల్పి కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తూ, హైదరాబాద్ కళాశాలలకు దీటుగా ర్యాంకులను సాధిస్తున్న కళాశాల అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. లాభాపేక్ష లేకుండా ఉన్నత చదువునందిస్తున్న కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేశ్, ప్రిన్సిపాల్ గాలిపెళ్లి ఈశ్వర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మెమెంటోలు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
కొడిమ్యాల, ఆక్టోబర్ 29 : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సంజీవయ్య మాట్లాడుతూ విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.