దశాబ్దాల పాటు సమస్యలతో నెట్టుకొచ్చిన రేకులపల్లి.. స్వరాష్ట్రంలో మురిసిపోతున్నది. అభివృద్ధికి దూరంగా చీకట్లో మగ్గిన ఆ ఊరు.. రాష్ట్ర సర్కారు చొరవతో ప్రగతి కాంతులీనుతున్నది. నెలనెలా వస్తున్న ప్రగతి పద్దుతో ఏడాదిన్నరలోనే తన రూపురేఖలు మార్చుకొని కొత్త శోభ సంతరించుకున్నది. ప్రధానంగా మహిళా సర్పంచ్ ఎలగందుల లక్ష్మి కృషితో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. జీపీ భవనం, వైకుంఠధామాల నిర్మాణానికి తన అత్తమామల పేరున 18గుంటల స్థలం కొనుగోలు చేసి విరాళంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచారు. అద్దాల్లాంటి రోడ్లు, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి పలువురి మన్ననలు పొందుతున్నారు.
– సారంగాపూర్, అక్టోబర్ 26
రేకులపల్లి మురిసిపోతున్నది. మొన్నటిదాక నిధుల లేమితో సతమతమైన ఆ గ్రామం, నేడు పల్లె ప్రగతి ఫలాలతో పరవశించిపోతున్నది. నెలనెలా వస్తున్న ప్రగతి పద్దుతో ఏడాదిన్నరలోనే తన రూపురేఖలు మార్చుకొని కొత్త శోభ సంతరించుకున్నది. బీర్పూర్ మండలంలోనే గ్రామాన్ని ఆదర్శంగా నిలిపేందుకు మహిళా సర్పంచ్ లక్ష్మి ఎంతగానో కృషి చేస్తున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని గ్రామాల కంటే ముందుగా ప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్ల ఏర్పాటు, వైకుంఠధామాలను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు. పల్లెప్రగతి, హరితహారం, ఇంకుడు గుంతల ఏర్పాటు తదితర కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తు ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా చేపడుతున్నారు.
అభివృద్ధికి 18 గుంటల భూ విరాళం..
గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటుకు స్థల సేకరణకు ఇబ్బందులు రావడంతో సర్పంచ్ తన అత్తమామల పేరున 18గుంటల స్థలం కొనుగోలు చేసి విరాళంగా అందించారు. అలాగే గ్రామంలో నూతన పంచాయతీ భవనానికి తన అత్తమామల పేరున దాదాపు 2 గుంటల స్థలాన్ని అందించి ఆదర్శంగా నిలిచారు. పంచాయతీ భవనం ముందు సొంత ఖర్చులతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. అలాగే గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను, చేపట్టాల్సిన పనులు, పరిసరాల పరిశుభ్రత, మురుగు కాలువలు శుభ్రం చేయడం, గ్రామంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించాలని తీర్మానించుకుని ఆ దిశగా పనులు చేపడుతుండగా, గ్రామంలోని కాలనీలు ఎటు చూసినా పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి. గ్రామ శివారులోని పల్లెప్రకృతి వనంలో మొక్కలను నాటగా ఏపుగా పెరుగుతున్నాయి. గ్రామంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా వెయ్యి మొక్కలు నాటించి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. గ్రామంలో చెత్త సేకరణకు బుట్టలను అందజేశారు. ప్రధాన కూడళ్ల వద్ద కమ్యూనిటీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లాలోనే రేకులపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సర్పంచ్ ఎలగందుల లక్ష్మి, ఎంపీటీసీ నారపాక జమున, గ్రామ కార్యదర్శి రాణి, ఉప సర్పంచ్ రమేశ్, పాలకవర్గ సభ్యులు ముందుకెళ్తున్నారు.
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి
గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నం. గ్రామంలో వైకుంఠధామం నిర్మాణానికి స్థలం లేకపోతే మా సొంత స్థలం 16 గుంటలను మా అత్తమామల పేరున విరాళం అందించాం. పంచాయతీ భవన నిర్మాణానికి మరో 2గుంటలు భూమిని విరాళంగా ఇచ్చాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ప్రజాప్రతినిధుల సహకారంతో అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్నం. జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలుపడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.
– ఎలగందుల లక్ష్మి, సర్పంచ్ (రేకులపల్లి)