నేతన్నకు తెలంగాణ సర్కారు భరోసానిస్తున్నది. అధికారం చేపట్టిన వెంటనే మూలనపడ్డ మరమగ్గాలకు ఊపిరిలూదింది. కార్మికుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల యూనిఫాంల తయారీ బాధ్యతను అప్పగించింది. ఏటా బతుకమ్మ చీరెల ఆర్డర్లు ఇచ్చి చేతినిండా పని కల్పిస్తున్నది. ఇటీవలే బతుకమ్మ చీరెల తయారీ పూర్తి కాగా, ఇరవై రోజుల క్రితం 14కోట్లతో క్రిస్మస్, కేసీఆర్ కిట్ల ఆర్డర్లిచ్చింది. వచ్చే నెలాఖరులోగా తయారీ పూర్తి చేయాల్సి ఉండగా, కార్మిక క్షేత్రంలో వస్ర్తోత్పత్తి పండుగలా సాగుతున్నది.
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమ 2000లో తీవ్ర సంక్షోభా న్ని ఎదుర్కొన్నది. కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలతో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ఉద్యమ నేత కేసీఆర్ ఇక్కడి కార్మికుల దయనీయ స్థితికి చలించి పోయారు. వెంటనే కార్మికుల సంక్షేమానికి 50 లక్షల పార్టీ ఫండ్‌ను అందజేసి ఆదుకున్నారు. మైక్రో, షేర్ముల్లా లాంటి ఫైనాన్స్‌ల ఉచ్చులో పడ్డ కార్మిక కుటుంబాలను ఆయన ఆనాడే ఆదుకున్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత వచ్చిన ప్రభుత్వంలో సిరిసిల్ల ఎమ్మెల్యేగా, చేనేత జౌళిశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి కేటీఆర్ వల్ల ఉరిసిల్ల పేరును తుడిచి వేసి ‘సిరి’సిల్లగా మార్చివేశారు. నేతన్నలకు ఉపాధి కల్పించి, టెక్స్టైల్స్ రంగా న్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం తో 3వేల కోట్ల వస్త్ర ఆర్డర్లు నేతన్నలకు ఇప్పించారు. ప్రతి దసరాకు ఆడబిడ్డకు కానుకగా కోటిచీరెలతోపాటు, క్రిస్మస్, రంజాన్, వి ద్యార్థుల యూనిఫాం, కేసీఆర్ కిట్ల తయారీ ఆర్డ ర్లు రాష్ట్రంలోని 40వేల మరమగ్గాలకు ఇప్పించారు. అలాగే త్రిఫ్ట్, యార్న్‌పై 10 శాతం సబ్సిడీని అందించారు. విరివిగా రుణాలు మంజూరు చేశారు. ఇటీవలే ఏదేని పరిస్థితుల్లో మరణించిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు 5లక్షల చేనేత బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
14కోట్లతో క్రిస్మస్, కేసీఆర్ కిట్ల ఆర్డర్లు
ప్రభుత్వం ఇచ్చిన కోటీ బతుకమ్మ చీరల తయారీ గత నెలతో పూర్తయ్యింది. ఎనిమిది నెలల పాటు ఉపాధి పొందిన కార్మికులకు అదనపు ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం తా జాగా 14కోట్ల ఆర్డర్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇచ్చింది. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగకు ఉచిత దుస్తుల పంపిణీ చేయనున్నది. అందులో భాగంగా క్రిస్మస్, కేసీఆర్ కిట్ల తయా రీ కోసం ఈ నెల మొదటి వారంలో ఆర్డర్లు రావడంతో వస్త్ర ఉత్పత్తుల తయారీలో నేతన్నలు మళ్లీ బిజీ అయ్యారు. 14కోట్లలో క్రిస్మస్ వస్ర్తా లు 35.45, కేసీఆర్ కిట్లు 31.40లక్షల మీటర్లు రెండు నెలల్లో తయారు చేయాల్సి ఉంది. సిరిసిల్లలోని 139 మాక్స్ సంఘాలు, 142 ఎస్ఎస్ఐ యూనిట్లలోని 10వేల మరమగ్గాలపై 6 వేల మంది కార్మికులకు పనిలభించింది. వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటికే లక్ష్యం సగానికిపైగా పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో బీడీ కార్మికులు సైతం సాంచాలు నడపడం, కండెలు చుట్టం లాంటి పనులతో ఉపాధి పొందుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
భీవండి, సూరత్కెళ్లి ఆగమైనం..
ఒకప్పుడు పొట్ట చేతబట్టుకుని భీవండి, సూరత్‌కు వెళ్లి ఆగమైనం. భార్యాపిల్లలను వదిలి పెట్టి ఏళ్లతరబడి ఊరుగాని ఊరు పోయి నాలుగు రూకలు సంపాదించినం. మంత్రి కేటీఆర్ పుణ్యమా అని ఇయ్యాల మాసొంతూరికొచ్చి పన్జేసుకుంటున్నం. కుటుంబంతో కలిసుంటూ రెండుపూటలా కడుపు నిండా బువ్వ తింటున్నమంటే సార్ దయవల్లనే. బతుకమ్మ చీరలు తయారు చేసినం. దసరా పండుగ ఎళ్లినంక పనెట్లానుకున్నం. మళ్లా క్రిస్మస్, కేసీఆర్ కిట్ల చీరల తయారీ ఆర్డర్లు ఇప్పించి నందుకు సంతోషంగా ఉంది.
– దాసరి మల్లేశం,పవర్‌లూం కార్మికుడు (సిరిసిల్ల)
సార్ దయవల్లనే
బతుకమ్మ చీరలు, బడి పిల్లల బట్టల తయారీతో ఏడేండ్లుగా ఇక్కడే పనిచేసుకుంటూ బతుకున్నం. నాడు పనికోసం ఎక్కడెక్కడో తిరిగినం. ఊళ్లెనే పనిదొరికిందంటే కేటీఆర్ సార్ దయతోనే. నెలకు రూ. పదివేలు వచ్చినయంటే ఎంతో గొప్పనుకున్నం. ఇయ్యాల నెలకు 20వేల దాకా సంపాదిస్తున్నం. ఆరునెలలు బతుకమ్మ చీరెలు నడిపించినం. పగార మంచిగొచ్చింది. నోట్లోకి పోతున్న ముద్దను చూసుకుంటూ ఎప్పుడు సార్‌ను గుర్తు చేసుకుంటం.
– కుందెన శ్రీనివాస్, పవర్‌లూం కార్మికుడు (సిరిసిల్ల)