పెద్దపల్లి, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం వైద్యసేవలను ప్రజలకు చేరువచేసే లక్ష్యంతో సర్కారు దవాఖానలు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో సకల వసతులు కల్పించింది. వైద్యనిపుణులను అందుబాటులోకి ఉంచింది. అయితే వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ప్రజలు వేలకువేలు ధారపోయాల్సి వస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దవాఖానకు వెళ్లినా తప్పనిసరిగా రక్త, మూత్ర పరీక్షలు చేయడం తప్పని సరైంది. ఓపీ సేవలు సర్కారు దవాఖానల్లో ఉచితంగా అందుతున్నప్పటికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు మాత్రం పేదలు తమ జేబు గుళ్ల చేసుకోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే సర్కారు 2018లో టీ హబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాకు రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భవన నిర్మాణానికి రూ.1.5 కోట్లు, పరికరాల కోసం రూ.50లక్షలు కేటాయించింది. మే 4 2022న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాటి నుంచి పనులు చురుగ్గా జరుగుతుండగా డిసెంబర్ ఆఖరు నాటికి పూర్తిచేయనున్నారు.
ఒకేచోట 57 రకాల పరీక్షలు
తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్ అందుబాటులోకి వస్తే ఒకే చోట 57 రకాల పరీక్షలు అందుబాటులోకి వస్తాయి. ఒకేసారి రక్త, మూత్ర, అవయవ పనితీరు, థైరాయిడ్, లివర్, కిడ్నీ పనితీరు, కొలెస్ట్రాల్, చికున్‌గున్యా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, క్యాల్షియం, సిరమ్ క్రియాటినైన్, డీహెచ్డీఎల్, ఎలొక్టోరైట్స్, హెచ్బీఎస్హెచ్జీ వంటి 57 రకాల పరీక్షలు చేస్తారు. వీటితో పాటు ఖర్చుతో కూడుకున్న సిటీస్కాన్, 2డీ ఈకో, అల్ట్రా సౌండ్, మ్యామెగ్రఫీ లాంటి స్కానింగ్ పరీక్షలు పేదలకు అందుబాటులోకి రానున్నాయి.
ప్రజలకు ఎంతో మేలు
నిరుపేదలకు ఖరీదైన వైద్యాన్ని చేరువ చేయాలని తెలంగాణ ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇంకా వ్యాధి నిర్ధారణ పరీక్షలను సైతం ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలను టీ-డయాగ్నోస్టిక్ కేంద్రం ద్వారా మూడు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి.
-డాక్టర్ కొండ శ్రీధర్, డీసీహెచ్ఎస్, పెద్దపల్లి