ప్రాణాంతకంగా పరిణమించిన మూత్ర పిండాల వ్యాధిగ్రస్తులకు సిరిసిల్ల డయాలసిస్ సెంటర్ అపరసంజీవనిలా మారింది. ప్రైవేట్‌లో వేలకు వేలు పోసి వైద్యం చేయించుకోలేని బాధితులకు ఊపిరినిస్తూ.. ఆయువు పెంచుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లా దవాఖానలో ఏర్పాటైన ఈ కేంద్రం, ఐదేళ్ల నుంచి దిగ్విజయంగా సేవలందిస్తున్నది. ఇప్పటివరకు 32,623 మందికి గాంధీ దవాఖాన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించగా, బాధితులకు సాంత్వన దొరుకుతున్నది.
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): కిడ్నీ బాధితులు డయాలసిస్ కోసం గతంలో వరంగల్, హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్లాలంటే సమయమంతా ప్రయాణానికే సరిపోయేది. సమయానికి బస్సులుండేవి కాదు. ఉన్నా కిక్కిరిసి వెళ్లాల్సి వచ్చేది. లేదంటే ప్రైవేట్ వెహికిల్ కిరాయి తీసుకోవాల్సి వచ్చేది. వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వెళ్లడానికి రోజంతా గడిచిపోయేది. తీరా అక్కడికి వెళ్లాక బెడ్డు ఖాళీలేకుంటే మరోరోజు వేచి ఉండాల్సి వచ్చేది. సమయానికి డయాలసిస్ చేయించుకోకుంటే ప్రాణానికే ముప్పు ఉండేది. ఒక్కసారికే వేలకువేలు ఖర్చు చేయాల్సి వచ్చేది.
ఇలా కిడ్నీ బాధితుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం జిల్లాకో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో అత్యాధునిక వసతులతో నెలకొల్పింది. ఐదేండ్ల కింద ఏరియా దవాఖానలో పది బెడ్లతో రక్తశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి జిల్లాలోని 13 మండలాల వారికే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా రోగులకు పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో నెప్రాలజీ వైద్యుల సూచన మేరకు ఇక్కడి వైద్య సిబ్బంది చికిత్స చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో గాంధీ దవాఖాన వైద్యుల పర్యవేక్షణలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యం అందిస్తున్నారు.
మంచిగ సూత్తున్నరు..
మాది రుద్రంగి. నేను ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్త. భార్య, బిడ్డ, కొడుకు ఉన్నరు. 40 ఏండ్ల వయసులోనే నాకు రెండు కిడ్నీలు చెడిపోయినయ్. హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానలో పరీక్ష చేయించుకుంటే వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాలన్నరు. అందుకు నెలకు 20వేలు ఖర్చయితదన్నరు. కానీ, పైసా ఖర్చు లేకుండా సిరిసిల్ల దవాఖానలో చేస్తున్నరు. నెలకు పన్నెండు సార్లు రక్త శుద్ధి చేయించుకుంటున్న. ఇక్కడ వైద్యులు చాలా మంచిగ సూత్తున్నరు. ప్రైవేట్‌లో లభించే వైద్యం ఇక్కడ అందుతున్నది. చాలా సంతోషంగా ఉంది.
– పీసరి భూమానందం. ట్రాక్టర్ డ్రైవర్ (రుద్రంగి)
ఐదేండ్లలో32,623 మందికి సేవలు..
సిరిసిల్ల డయాలసిస్ సెంటర్ దిగ్విజయంగా నడుస్తున్నది. కాగా, కేంద్రంలో ఒక్కో పేషెంట్‌కు నాలుగు గంటల సమయం పడుతున్నది. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 8గంటల వరకు సేవలందిస్తున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ కింద కిడ్నీ వ్యాధి బాధితులకు వైద్యం అందిస్తున్నారు. ఐదేండ్లలో 32,623 మందికి డయాలసిస్ సేవలందించారు. వీరందరికీ కోట్లాది రూపాయల విలువైన రక్త శుద్ధి, మందులు ఉచితంగా ఇచ్చారు.
కేటీఆర్ దయతోనే నేనింకా బతికున్న
మాది గంభీరావుపేట. నా రెండు కిడ్నీలు చెడిపోయినయ్. వారానికి మూడు సార్లు రక్త శుద్ధి చేయించుకుంటున్న. అసలే మధ్యతరగతి కుటుంబం మాది. బయట చేయించుకుంటే నెలకు కనీసం 30వేలు ఖర్చయ్యేది. ముఖ్యమంత్రి కేసీఆర్ దయవల్ల సర్కారులో ఉచితంగా సేవలందుతున్నయి. కేటీఆర్ సార్ జెయ్యబట్టి ఇక్కడ మాకు వైద్యం అందుతున్నది. ఆయన దయవల్ల నేనింకా బతికున్న.
– జోగయ్యగారి వెంకట్రాజం, గంభీరావుపేట