సిరిసిల్ల రూరల్, అక్టోబర్ 17 :గోడలపై రంగురంగుల చిత్రాలు, ఆకట్టుకునేలా అక్షరమాల, పిల్లలు ఆడుకునేందుకు ఆటవస్తువులు, న్యూట్రిషన్ గార్డెన్ ఇవన్నీ చూస్తుంటే కార్పొరేట్ స్కూల్ ఏమో అనిపిస్తున్నది కదా! కానీ, ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రగుడు అంగన్వాడీ కేంద్రం! 4లక్షలు వెచ్చించి సకల సౌకర్యాలు కల్పించడంతో సుందరంగా తయారైంది. ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఈ సెంటర్, పిల్లలను ఇట్టే ఆకర్శిస్తున్నది. అమాత్యుడి ప్రత్యేక చొరవతో మండలానికో మోడల్ అంగన్ వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మారుతున్నాయి. అందంగా తీర్చిదిద్దుతుండడంతో చిన్నారులను ఆకర్శిస్తున్నాయి. 13 మండలాల్లో మండలానికో అంగన్వాడీ కేంద్రాన్ని మోడల్ అంగన్వాడీగా తీర్చిదిద్దబోతున్నారు. సొంత భవనాలున్నా అన్ని అంగన్వాడీ కేంద్రాలను సుందరీకరించి, మౌలిక వసతులు, ఇతర మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడులో అంగన్వాడీ కేంద్రాన్ని మోడల్‌గా తీర్చిద్దిద్దారు. గత నెల 27న మంత్రి కేటీఆర్ ప్రారంభించడంతో చిన్నారులు, తల్లిదండ్రులు, వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రగుడులో మోడల్..
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రగుడులో అంగన్వాడీ కేంద్రాన్ని రంగులు వేసి, సుందరంగా మార్చారు. గోడలపై చిన్నారుల చిత్రాలు, ఆకట్టుకునేలా అక్షరమాల, పలక, ఆట బొమ్మలు, ఇలా రకరకాల రంగులతో అందంగా రూపొందించారు. 4లక్షలకు పైగా నిధులతో ఆటవస్తువులు, మౌలిక వసతులు, పరిసరాల్లో టైల్స్, న్యూట్రిషన్ గార్డెన్, ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. చిన్నారులకు పోషణ లోపం లేకుండా ఆర్గానిక్ ఫుడ్ అందేలా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇక్కడే ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ఈ కేంద్రం విపరీతంగా ఆకర్శిస్తున్నది. చిన్నారులకు ఆహ్లాదం,ఆనందం పంచుతున్నది.
మోడల్ కేంద్రాలివే..
సిరిసిల్ల జిల్లాలో మండలానికో అంగన్వాడీ కేంద్రాన్ని మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపిక చేసి, ఏర్పాటు చేస్తున్నారు. సిరిసిల్ల పరిధిలో రగుడు అంగన్వాడీ కేంద్రాన్ని ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తంగళ్లపల్లి మండలంలో నేరేళ్ల-2 అంగన్వాడీ కేంద్రం, గంభీరావుపేటలో నర్మాల-1 అంగన్వాడీ కేంద్రం, ముస్తాబాద్‌లో నామాపూర్-3 అంగన్వాడీ కేంద్రం, ఎల్లారెడ్డిపేటలో నారాయణపూర్-1, వీర్నపల్లిలో అడవిపదిర-1, ఇల్లంతకుంటలో గొల్లపల్లి, వేములవాడ అర్బన్‌లో తెట్టెకుంట, వేములవాడ రూరల్‌లో ఎదురుగట్ల, బోయినపల్లి లో కొదురుపాక-1, కోనరావుపేట లో వట్టిమల్ల-3, చందుర్తిలో ఎన్గల్-2, రుద్రంగిలో రుద్రంగి-5 అంగన్వాడీ కేంద్రాలను మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా ఎంపిక చేసి, మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు.
చాలా బాగున్నది
మా ఊరి అంగన్వాడీ కేంద్రాన్ని చక్కగా చేసిండ్రు. చాలా అందంగా కనపడుతున్నది. మొత్తం మారింది. నా బిడ్డను అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్న. చాలా బాగా చూసుకుంటున్నరు. ఇంతకుముందు త్వరగా ఇంటికి వచ్చేది. ఇప్పుడు ఎక్కువ సేపు అంగన్వాడీ కేంద్రంలోనే పిల్లలతో కలిసి ఉంటున్నది. చక్కగా అక్షరాలు నేర్చుకుంటున్నది.
– సరిత, చిన్నారి తల్లి (రగుడు)
చిన్నారుల్లో ఉత్సాహం
రగుడు అంగన్వాడీ కేంద్రాన్ని సుందరంగా తీర్చిద్దిదారు. మంత్రి కేటీఆర్ సార్ ప్రారంభించారు. చిన్నారులు చాలా సంబురపడుతున్నారు. మరింత ఉత్సాహంగా కేంద్రానికి వస్తున్నారు. ఉల్లాసంగా గడుపుతున్నారు. ఆహారం కూడా చక్కగా తీసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు.
– పద్మ, అంగన్వాడీ టీచర్ (రగుడు)
మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. మా వార్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని మోడల్ అంగన్వాడీ కేంద్రంగా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మా కూతురును కూడా అంగన్వాడీ కేంద్రాన్ని పంపిస్తున్నాం. అంగన్వాడీ కేంద్రం అందంగా మారడంతో చిన్నారులు ఉత్సహంగా వెళ్తున్నారు.
– పోచవేణి సత్య, ఒకటో వార్డు కౌన్సిలర్ (సిరిసిల్ల)