పెద్దపల్లి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ)l;నిరుద్యోగ యువత కొలువుల కల సాకారానికి వేలాది నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న రాష్ట్ర సర్కారు, శిక్షణకూ భరోసా ఇస్తున్నది. ఎక్కడో దూరాన ఉన్న ప్రైవేట్ సెంటర్లలో కోచింగ్ తీసుకోలేని గ్రామీణ పాంత అభ్యర్థుల కోసం జిల్లాల వారీగా బీసీ స్టడీ సర్కిళ్లు పెడుతూ భవితకు బాసటగా నిలుస్తున్నది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సెంటర్ ఏర్పాటు చేయగా, గ్రూప్ 3,4లో శిక్షణ దిగ్విజయంగా నడుస్తున్నది. మొత్తం 124 మంది ఉద్యోగార్థులకు నిష్ణాతులైన ఫ్యాకల్టీతో కోచింగ్ ఇప్పిస్తుండగా, యువతీ యువకుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. –
పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్(బీఆర్ఎస్) సర్కారు, యువత కొలువుల స్వప్నాన్ని సాకారం చేస్తున్నది. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వేస్తూ భరోసా కల్పిస్తున్నది. ఎనిమిదేండ్లలోనే 1.32లక్షల జాబ్స్‌ను భర్తీ చేసింది. కొద్దిరోజుల క్రితమే 80వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించి, విడుతలవారీగా నోటిఫికేషన్లు ఇస్తున్నది. నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు, గ్రామీణ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు కోచింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నది. జిల్లాల వారీగా బీసీ స్టడీ సర్కిల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెలకొల్పిన సెంటర్ దిగ్విజయంగా నడుస్తున్నది.
గ్రూప్స్ 3,4లో 124 మందికి శిక్షణ..
పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత నెల 29న బీసీ స్టడీ సెంటర్‌ను ప్రారంభించారు. గ్రూప్స్3,4లో శిక్షణ కోసం మొత్తం 124 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. బీసీ స్టడీ సర్కిల్ కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీని గాండ్ల రామకృష్ణ బోధిస్తున్నారు. గ్రూప్-3లో ప్రధానంగా కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, క్వాలిటీ, ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, మ్యాథ్స్‌లో రీజనింగ్, ఆర్థమెటిక్, సమాజ విజ్ఞాన శాస్ర్తాన్ని బోధిస్తున్నారు. గ్రూప్-4లో కరెంట్ ఎఫైర్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీ డే లైఫ్, ఇండియన్ హిస్టరీ, సంస్కృతి వారసత్వం, కళలు, మ్యాథ్స్‌లో అర్థమెటిక్ లాజికల్, రీజనింగ్ సబ్జెక్టులను బోధిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్-3, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రూప్-4 లో శిక్షణ ఇస్తున్నారు. ఒకవైపు బోధిస్తూనే మరో వైపు యువతకు వచ్చే సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఒక్కోబ్యాచ్‌కు నెలరోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా మరో 100 నుంచి 150 మంది అభ్యర్థులు వచ్చే అవకాశముండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ వెంకటేశం తెలిపారు.
ఎంత మంది వచ్చినా కోచింగ్ ఇస్తాం..
ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ కోసం పెద్దపల్లిలో బీసీ స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 200 మందికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 124 మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఇంకా దరఖాస్తులు వస్తున్నాయి. మూడు నెలలపాటు నడిచే ఈ సెంటర్‌కు ఎంత మంది వచ్చినా అందరికీ శిక్షణ ఇస్తాం. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. ఈ అవకాశాన్ని జిల్లా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.
– గాండ్ల రామకృష్ణ, ఫ్యాకల్టీ (పెద్దపల్లి బీసీ స్టడీ సెంటర్)
వ్యయ, దూరభారం తప్పింది..
నాకు నాలుగేళ్ల క్రితమే వివాహమైంది, ఇద్దరు పిల్లలు. మాది పేద, మధ్య తరగతి కుటుంబం. ఉద్యోగాల నోటిఫికేషన్ నాకు ఎంతో ఊరటనిచ్చింది. ఎలాగైనా సరే కొలువు సాధించాలనే పట్టుదలతో ఉన్నా. గ్రూప్స్‌కు ప్రిపేర్ కావాలంటే మెటీరియల్, కోచింగ్‌కు డబ్బు చాలా అవసరం. అలాంటి ఇబ్బందు లేకుండా ప్రభుత్వం బీసీ స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. మా జీవితాన్ని మార్చుకోవడానికి ఇదో అవకాశం. తప్పకుండా సద్వినియోగం చేసుకుంటా.
– జే గంగాదేవి, గృహిణి (పెద్దపల్లి)
నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా..
మాది పేద కుటుంబం. నా భర్త ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తున్నాడు. పదేళ్ల క్రితమే నాకు వివాహమైంది. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నా. నోటిఫికేషన్ రావడం, మాకు దగ్గరలోనే ఉచితంగా శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉంది. స్టడీ సర్కిల్ కేంద్రంతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లే భారం తప్పింది. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తా.
–హసీనా, సుల్తానాబాద్