కార్పొరేషన్, అక్టోబర్ 17: భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని నగర మేయర్ వై.సునీల్‌రావు పిలుపునిచ్చారు. జల సర్వేక్షణ్- 2022లో భాగంగా సోమవారం సాయంత్రం మానేరు వంతెన వద్ద ఉన్న ప్రతి రోజు మంచినీటి సరఫరా పైలాన్ వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, నగరపాలక సిబ్బంది, మేయర్ వై.సునీల్‌రావు జల సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల సర్వేక్షణ్‌లో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నీటి పొదుపు విషయంలో అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నగరవాసుల్లో నీటి పొదుపుపై అవగహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రజలు నీటి పొదుపు విషయంలో సహకారం అందించాలన్నారు. భవిష్యత్తు తరాలకు మంచినీటిని అందించేందుకు ప్రతి ఒక్కరూ నీటి పొదుపును పాటించాల్సిన అవసరముందన్నారు. భూగర్భ జలాలు పెరిగే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకోవాలని సూచించారు.
సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం
నగరవాసుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పాలకవర్గం పని చేసున్నదని, నగర మేయర్ వై.సునీల్‌రావు అన్నారు. సోమవారం 52వ డివిజన్లో సీసీ డ్రైనేజీ, రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్ల సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులు మంజూరు చేయడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు. అన్ని డివిజన్లల్లో వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్స్, పబ్లిక్ టాయిలెట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రతి వీధిలో సీసీ రోడ్డు నిర్మించడంతో పాటు పచ్చదనం కోసం రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని గుర్తు చేశారు. నగరంలో ప్రతి రోజూ మంచినీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛ సర్వేక్షన్లో బల్దియా ర్యాంకు మెరుగుపడిందని తెలిపారు. రానున్న కాలంలో మరింత మంచి ర్యాంకు సాధించేందుకు ప్రజల భాగస్వామ్యం పెరుగాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లు, మురుగుకాల్వల్లో చెత్త వేయకుండా చెత్త రిక్షాలు, ఆటోలకు అందించాలని కోరారు. నగరంలోని ప్రధాన రహదారులు, లింకు రోడ్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు కోల మాలతి, అఖిల్ఫిరోజ్, నాయకుడు వంగల పవన్, నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.