అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక మంచి సంప్రదాయం ఉన్నది. వారు ప్రపంచ వ్యాప్తంగా యువనాయకులకు నాయకత్వ శిక్షణలు ఇవ్వటంతోపాటు అసాధారణ విజయాలు సాధించిన వారిని ఆహ్వానించి అవి ఎట్లా సాధించగలిగారో తమ మేనేజ్మెంట్ విద్యార్థులకు వివరించవలసిందిగా కోరుతారు. ఉదాహరణకు యూపీఏ ప్రభుత్వంలో రైల్వేమంత్రిగా పని చేసిన లాలూప్రసాద్ యాదవ్ (2004-09).
ఆ కాలమంతా భారతీయ రైల్వేలు తీవ్ర నష్టాల్లో ఉండేవి. అటువంటి క్లిష్ట దశలో ఆయన పట్టుబట్టి రైల్వేశాఖను తీసుకుని లాభాల్లోకి తేవటం హార్వర్డ్ను ఆకర్షించింది.
లాలూప్రసాద్ రైల్వేశాఖను తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కలవరపాటుకు కూడా గురిచేసింది. ఎందుకంటే, అంతకుముందు రైల్వేమంత్రులుగా పని చేసిన హేమాహేమీలు కూడా నష్టాలను అరికట్టలేకపోయారు. అందుకు తగినట్టు ఎవరికీ లాలూప్రసాద్పై గురిలేదు. అటువంటి వ్యతిరేకతల మధ్య బాధ్యతలు తీసుకున్న ఆయన, పరిస్థితిని అనూహ్యమైన మలుపుతిప్పి రైల్వేను రూ.90,000 కోట్ల లాభాల్లోకి తెచ్చారు. ఆ ఘనత ఎట్లా సాధ్యమైందో తమ మేనేజ్మెంట్ విద్యార్థులకు తెలియజెప్పాలని హార్వర్డ్ యూనివర్సిటీ వారు కోరారు.
రేవంత్‌రెడ్డి విషయానికి వస్తే, ఆయన హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో లీడర్షిప్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పూర్తి చేసినట్టు వార్తలు వచ్చాయి. 21వ శతాబ్దంలో ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్లు, అధికార విశ్లేషణ, నాయకత్వ మెలకువలు, సంక్షోభ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవటం ఎట్లా అనే అంశాలపై కేస్ స్టడీలు, గ్రూప్ ప్రాజెక్టుల ద్వారా ఆయన శిక్షణ పొందినట్టు కూడా ఆ వార్తలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమం జనవరి 25 నుంచి 30 వరకు ఆరు రోజులపాటు జరిగిందని చెప్పాయి.
ఇందుకు సంబంధించిన ఇతర వివరాలేమీ వెల్లడి కాలేదు. సూచనగా తెలియవచ్చిన శిక్షణాంశాలు ఏవీ తేలికైనవి కావు. ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయి అంశాల్లో, ఆ స్థాయి విద్యా సంస్థ నుంచి శిక్షణ పొందినప్పుడు, ఆయా అంశాలు ఏమిటో, శిక్షణా వివరాలు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి రాష్ట్ర ప్రజలకు ఉంటుంది. పైగా ఒక ఐవీ లీగ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ పొందిన మొట్టమొదటి భారతీయ ముఖ్యమంత్రి ఆయనేనని వార్తల్లో పేర్కొన్నారు. శిక్షణ ద్వారా నేర్చిన నైపుణ్యాలు ఏమిటో రాగల కాలంలో పరిపాలన ద్వారా ప్రజలకు తెలియవస్తుందన్న మాట నిజమే. ఆయినప్పటికీ తను స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆ విషయాలు తెలియజేస్తే ప్రజలు తెలుసుకుని సంతోషిస్తారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు.
లాలూప్రసాద్‌ను హార్వర్డ్, వార్టర్ సంస్థలు తామే ఆహ్వానించటానికి, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి కెన్నెడీ స్కూల్లో తానే ఫీజు కట్టి అడ్మిషన్ తీసుకోవటానికి మధ్య తేడాలున్నాయి గానీ చర్చించదల్చుకున్నది అది కాదు. చెప్పదలచుకున్నది ఏమంటే రాజకీయంగా రేవంత్‌రెడ్డి సాధించారంటున్న దాని నుంచి విశ్లేషించి అర్థం చేసుకోవలసినవి కూడా హార్వర్డ్ సంస్థలకు ఉన్నాయి. 2014 నుంచి 2023 మధ్య తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుల స్వభావం, శక్తి సామర్థ్యాలు, వ్యక్తిగత వ్యవహారశైలి ఏమిటి? ఒకరి నుంచి మరొకరికి తేడాలు ఏమిటి? ముఖ్యంగా రేవంత్‌రెడ్డిలోని తేడా ఏమిటి? అన్నవి ఒక విధమైన పరిశీలనాంశాలు. మరొకవైపు జాతీయ స్థాయిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి?
కాంగ్రెస్ నాయకత్వం పరిస్థితి ఏమిటి? వేర్వేరు రాష్ర్టాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? వీటన్నింటి మధ్య వారు తెలంగాణలో కోరుకున్నది ఏమిటి? ఆ కోరిక నెరవేరేందుకు ఏమి చేయదలిచారు? ఏమి చేశారు? అన్నవి మరొక విధమైన పరిశీలనాంశాలు. కాంగ్రెస్ గెలిచిన 2023 ఎన్నికల ముందు కాలంలో తెలంగాణలో ఉన్న పరిస్థితులు, ప్రజల ఆలోచనలు, కోరికలు ఏమిటి? కాంగ్రెస్ ఎందువల్ల గెలువగలిగింది? అన్నవి ఇంకొక విధమైన పరిశీలనాంశాలు. ఈ మూడింటి సారాంశాన్ని రాబట్టగలిగితే తప్ప రేవంత్‌రెడ్డి వంటి వ్యక్తి నాయకత్వాన తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లా గెలువగలిగిందనేది బోధపడదు. ముఖ్యంగా హార్వర్డ్ స్థాయి రాజకీయ, సామాజిక, మేనేజ్మెంట్ అధ్యయనాలు కూలంకషంగా ఉంటాయి గనుక ఆ కోణం నుంచి అర్థంకాదు. పైగా ఆ విజయం ఎట్లా సాధ్యమయిందన్నది ఎవరికీ సరిగా బోధపడలేదు.
హార్వర్డ్ వారికి ఈ సబ్జెక్ట్ తట్టిందో లేదో గానీ, తట్టినట్టయితే మాత్రం రైల్వేల విషయంలో లాలూప్రసాద్ వలె, తెలంగాణ ఎన్నికల విషయం గురించి రేవంత్‌ను ఆహ్వానించి తమకు పాఠం చెప్పమని కోరేవారేమో! ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే దీనంతటిలో రేవంత్‌రెడ్డి నిమిత్త మాత్రుడు మాత్రమే. ఆ కాలపు పలు విధాలైన పరిస్థితులు కేటలిస్టు శక్తులుగా పనిచేసి, ఆ విధమైన ఫలితాలకు దారి తీశాయి.
రేవంత్‌రెడ్డి వ్యక్తిత్వం, వ్యవహారశైలి కూడా ఒకటి. వీటన్నింటి మధ్య గల సంబంధాలు, డైనమిక్స్‌ను, వాటి వల్ల వచ్చే ఫలితాలను అర్థం చేసుకోవటం హార్వర్డ్ స్థాయి విద్యా సంస్థల పని. వారికి ఇది ఒక మాడల్ రూపం తీసుకుంటే, దానిని విద్యార్థులకు అవగతం చేయటం, ఇతర చోట్ల పరిస్థితులకు అన్వయించటం చేయవచ్చు. ఒకవేళ హార్వర్డ్ వారు ఆహ్వానించినా రేవంత్‌రెడ్డి ఇటువంటి సమగ్ర అవగాహనతో మాట్లాడగలిగే వారా అన్నది మనకు తెలియదు. కనుక ఆ ప్రశ్నను అట్లుంచి, పై మూడు విధాలైన ప్రశ్నలకు సమాధానాలను మనకు తోచినంత మేర కనుగొనేందుకు ప్రయత్నిద్దాము. వీటిలో అనేకం ఇప్పటికే చర్చకు వచ్చినవే అయినా సందర్భాన్ని బట్టి మరొకమారు చెప్పుకోవటం అవసరం.
2014లో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకునిగా కేసీఆర్ ప్రతిష్ట పతాకస్థాయిలో ఉండటం తెలిసిందే. అప్పటి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య (2014 మార్చి నుంచి 2015 మార్చి), తర్వాత అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (2015 మార్చి నుంచి 2021 జూలై) మంచి వారు, సాత్వికులు, అనుభవజ్ఞులే అయినా రేవంత్‌రెడ్డి (2021 జూలై నుంచి 2024 సెప్టెంబర్) వలె దూకుడు స్వభావం కలిగి, ఉచితానుచితాలు లేకుండా మాట్లాడి రెచ్చగొట్టే లక్షణాలు ఉన్న వారు కాదు. మరొకవైపు, కేసీఆర్ తెలంగాణ సాధించిన నాయకుడే గాక, అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలను మెప్పిస్తుండినందున కూడా ఉత్తమ్ హయాం ముగిసే వరకు కాంగ్రెస్ చేయగలిగిందేమీ లేకపోయింది. వ్యక్తిగతంగానూ ఉత్తమ్‌కు బలమైన నాయకత్వ లక్షణాలు లేవు. కార్యకర్తలు, ప్రజలను ఉత్తేజపరచటం, రెచ్చగొట్టటం చేయలేరు. ఈ పరిస్థితుల మధ్య కాంగ్రెస్ స్తబ్దంగానే ఉండిపోయింది.
తర్వాత మూడవ ఎన్నికలు సమీపిస్తుండగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి ఆందోళన పెరిగింది. ఒకవైపు జాతీయ స్థాయిలో, పలు రాష్ర్టాల్లోనూ ఓడుతూ, తెలంగాణలో మూడవసారి కూడా ఓడితే పరిస్థితి అధ్వాన్నం కాగలదని కాంగ్రెస్ హస్తిన నేతలు భయపడ్డారు. ఏ విధంగానైనా తెలంగాణను గెలిచి తీరాలన్న పట్టుదల ఏర్పర్చుకున్నారు. కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో ఇచ్చినట్టు అలవికాని హామీలివ్వటం మాత్రమే చాలదని భావించారు. దూకుడుతో రెచ్చగొట్టే నాయకుడు కావాలి అనుకున్నారు. అదే సమయంలో అటువంటి స్వభావమే గల బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.
అదే తీరున వ్యవహరించే రేవంత్‌రెడ్డి వల్ల ఉపయోగం ఉండవచ్చు అని భావించారు. ఉత్తమ్‌తో గానీ, పెద్ద మనిషీ గౌరవనీయుడూ అయిన జానారెడ్డితో గానీ లాభం లేదనుకున్నారు. ఆ విధంగా జాతీయ నాయకత్వపు అవసరాలూ, భయాలూ, బండి సంజయ్‌ని పోలిన దూకుడు, అనుచిత స్వభావం, శైలీ గల రేవంత్ వ్యక్తిత్వమూ, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్ తరహాలో అసాధ్యపు హామీలతో ఓటర్లను మభ్యపెట్టటం అనే మూడు కలిసినట్టయితే గెలువవచ్చునన్నది కాంగ్రెస్ నాయకత్వపు వ్యూహం, లేదా మేనేజ్మెంట్ టెక్నిక్ అయింది.
చివరగా కలిసి వచ్చిన అంశం.. బీఆర్ఎస్ పాలనలో పలు ప్రయోజనాలు పొందిన గ్రామీణులు తమ పరిస్థితులు మరింత వేగంగా మెరుగుపడగలవేమోనన్న ఆశాభావంతో, కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇచ్చి చూద్దామనుకోవడం. అటువంటి ఆశాభావానికి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ముడిపెట్టగలిగిన డ్రీమ్ మర్చంట్ వ్యూహ చాతుర్యం తోడయ్యాయి. ఆ విధంగా అనేకం కలిసి వచ్చి కాంగ్రెస్‌ను అనూహ్యమైన రీతిలో గెలిపించగలిగాయి. ఈ నాలుగు విధాలైన వాటిని కలగలిపి చూసినప్పుడు అది మరింత వివరంగా అధ్యయనం చేయదగిన ఒక మాడల్ అవుతుంది. కనుక, హార్వర్డ్‌లో శిక్షణ పొందిన రేవంత్‌రెడ్డి హార్వర్డ్ వారికి తానే ఒక పాఠం చెప్పగలరు.
– టంకశాల అశోక్