తొర్రూరు, ఫిబ్రవరి 9 : తొర్రూరు మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తంచేశారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలోనే రూ.100 కోట్లతో తొర్రూరు పట్టణాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు.
వంద పడకల దవాఖాన కోసం స్థలాన్ని కేటాయిస్తే రెండేండ్లు గడిచినా కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేదని మండిపడ్డారు. పట్టణంలో ప్రతి కులానికీ కమ్యూనిటీ హాల్ నిర్మించామని, ఇప్పుడు వాటిని తానే కట్టించినట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రారంభిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి మొండి చెయ్యి చూపిందని దుయ్యబట్టారు.