రామడుగు, అక్టోబర్17 : విద్యార్థులకు క్రమశిక్షణే ప్రధానమని ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా పేర్కొన్నారు. గోపాల్రావుపేట ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సోమవారం ఉదయం ప్రార్థన సమయంలో ఎంపీడీవో సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి బాల్యం నుంచే క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలన్నారు. ప్రతిరోజూ పాఠశాలలో నిర్వహించే ప్రార్థనలో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ దానికదే అలవాటుగా మారుతుందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా లక్షల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉచితవిద్యతో పాటు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, సన్నబియ్యంతో భోజనం వారానికి మూడుసార్లు కోడిగుడ్డును అందిస్తున్నారన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల రూపకల్పనలో భాగంగా మన ఊరు మన బడి పథకాన్ని ప్రవేశపెట్టి మండలంలోని 6 ఉన్నత పాఠశాలలు, 6 ప్రాథమిక పాఠశాలల్లో నూతన తరగతి గదులు, అదనపు గదులను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణ లేకపోవడంతో ప్రధానోపాధ్యాయురాలికి పలు సూచనలు చేశారు. పాఠశాలలో మరమ్మతు చేసిన తరగతి గదిని పరిశీలించారు. ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసిన కూరగాయలను పరిశీలించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన కూరగాయలను వినియోగించాలని సూచించారు. ఇక్కడ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ప్రకాశ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానకీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.