అనాదిగా పల్లె జీవనంలో ఒక్కటై పోయి కుటుంబాలకు జీవనాధారమైన పశుపోషణ కాలక్రమేణా మాయమవుతున్నది. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పశుపక్ష్యాదుల పెంపకం మరుగునపడుతున్నది. కానీ, కాల్వశ్రీరాంపూర్కు చెందిన ముగ్గురు రైతులు మాత్రం ఇప్పటికీ పాడినే నమ్ముకొని బతుకున్నారు. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన గోవుల పెంపకాన్ని బతుకుదెరువుగా మలుచుకొని మూడు తరాలుగా సంతతిని కాపాడుతున్నారు. ఒక్కటికాదు రెండు కాదు తలా వందకు పైనే గోవులను పెంచుతూ పెంట, ఎడ్ల విక్రయం ద్వారా ఏడాదికి 6 లక్షలకు పైనే ఆదాయాన్ని పొందుతున్నారు. తమకు ఆవులే జీవనాధారమని, అవే తమకింత అన్నం పెడుతున్నాయని సంతోషంగా చెబుతున్నారు.
కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్ 15 : నాడు పల్లెలంటే మనుషుల మధ్య ప్రేమానురాగాలే కాదు పశుపక్ష్యాదులతో విడదీయరాని ఆత్మీయ సంబంధం ఉండేది. ఎవరింట చూసినా పశుసంపద కనిపించేది. ఎడ్లపై రైతులకు ఎనలేని ప్రేమ ఉండేది. ఎవుసంలో ప్రతి పనికీ తోడుగా ఉండే ఆ ఎడ్లను రైతు కుటుంబంలో ఒకటిగా భావించేది. ఇక ఆవులు, బర్లు కూడా దాదాపుగా అందరిండ్లలోనూ ఉండేవి. ఎవరింట చూసినా పాలు, పెరుగు పుష్కలంగా దొరికేవి. వాటిని ఇంట్లో కుటుంబసభ్యుల్లెక్క చూసుకునేది. రానురానూ పరిస్థితి మారిపోయింది. ప్రస్తుత ఆధునిక యుగంలో పల్లెల్లో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కానీ, కాల్వశ్రీరాంపూర్ మండలం ఇద్లాపూర్కు చెందిన అల్లం ఎల్లయ్య, మొట్లపల్లి గ్రామానికి చెందిన సంగని పంపత్, తారుపల్లికి చెందిన కొట్టె భూమయ్యకు ఆవులతో విడదీయలేని అనుబంధం ఉన్నది. ఒక్కొక్కరికీ 100కుపైనే ఆవులున్నాయి. పశుపోషణను తమ తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా తీసుకున్న ఈ ముగ్గురు రైతులు, గోవులను తమ కుటుంబసభ్యుల్లెక్క చూసుకుంటున్నారు. రోజూ ఉదయాన్నే స్థానిక పంట పొలాల సమీపంలోని చేలకు మేత కోసం కొట్టుకొని పోయి, తిరిగి సాయంత్రం తిరిగి వస్తుంటారు. వానకాలంలో అన్నీ పంట పొలాలే కావడంతో ఖాళీ జాగా లేక మేత కోసం మందలను తీసుకొని సమీపంలోని అటవీ ప్రాంతాలకు వెళ్తారు. మందకు ఇద్దరు లేదా ముగ్గురు కలిసి వెళ్లి, అందులో ఒకరు ప్రతి పదిహేను రోజులకోసారి ఇంటికి వచ్చి సామగ్రి తీసుకెళ్తారు. కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి, ముత్తారం, రామగిరి మండలాల్లో విస్తరించి ఉన్న రామగిరి ఖిల్లా గుట్టలతోపాటు, కూనారం-ఇద్లాపూర్ గ్రామాలను కలిపి ఉన్న గుట్టల్లోనే ఉండి పశువులను మేపుతుంటారు. ఆగస్టు చివరి వారం నుంచి నవంబర్ చివరి వరకు అంటే దాదాపు మూడు నెలల పాటు అడవుల్లోనే జీవనం సాగిస్తారు. పంట పొలాలు కోతలు అయిపోయిన తర్వాత తిరిగి గ్రామాలకు చేరుకుంటారు.
పశుపోషణతో ఈ ముగ్గురు రైతులు దండిగా ఆదాయం పొందుతున్నారు. ఆవు పాలను ఇంట్లోని అవసరాలకు తీసుకొని మిగతావన్నీ లేగ దూడలకే విడిచిపెడుతున్నారు. ఆవు పేడను కుప్పలు చేసి వారానికి ఒక ట్రాక్టర్ లోడును 3 వేల చొప్పున సమీప గ్రామాల రైతులకు విక్రయిస్తున్నారు. ఇక పేడను తీసుకెళ్లలేని రైతుల కల్లాల్లోనే మందలు కట్టేసి రోజుకు 2 వేల చొప్పున తీసుకుంటున్నారు. కోడెలను విక్రయించడం ద్వారా భారీగానే సంపాదిస్తున్నారు. సగటున నెలకు 50వేల పైనే వస్తున్నదని, ఏడాదికి 5 లక్షల నుంచి 6 లక్షలకుపైగా ఆదాయం వస్తున్నదని చెబుతున్నారు.
నలభై ఏండ్ల కింద మా మామ బేరం మల్లయ్య నాకు వరకట్నం కింద రెండు ఆవులను అర్ణం కొట్టిండు. అప్పటి సంది వాటిని కంటికిరెప్పలా కాపాడుకుంట బతుకుతున్న. ఇప్పుడు నూరు జీవాలైనయ్. ఆవులు కాసుడే నా పని. ఇద్దరు కొడుకులు నాతోనే ఉంటరు. ఆవు పెండతోపాటు ఎదిగిన కోడెలను రైతులకు అమ్ముతం. ఏడాదికి 5 లక్షల దాకా ఆదాయం వస్తంది.
– కొట్టె భూమయ్య, తారుపల్లి
ఆవులే మా బతుకు దెరువు. ఎన్కటి సంది మా కుటుంబం ఇదే పనిమీద బతుకుతంది. రోజూ ఆవులను కొట్టుకొని కల్లాలపొంటి వోత. అక్కడ మేత లేకపోతే అడవులకు పోతం. నా వద్ద 100కు పైనే ఆవులున్నయి. పెండను పొలంలో పోసుకుంటం. సుట్టు పక్కల రైతులకు అమ్ముతం. ఎదిగిన కోళ్లాగలను సుతం అమ్ముతం.
– అల్లం రాజు, ఇద్లాపూర్