రామకృష్ణాపూర్, జనవరి 29 : సింగరేణి మందమర్రి ఏరియాలోని ఆర్కే 1ఏ గని మూసివేతకు రంగం సిద్ధమయ్యింది. ప్రతి ఏటా ఉత్పత్తిలో వెనుకబాటు, అధిక వ్యయంతో నష్టాలు వస్తుండడంతో సింగరేణి యాజమాన్యం గని మూసివేతకు నిర్ణయించింది. రామకృష్ణాపూర్ ప్రాంతంలో ప్రత్యేక ఏరియాగా ఉన్న సమయంలో 1982లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్య గనిని ప్రారంభించారు. ఆశించిన స్థాయిలో నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో గని మొదటి నుంచి వెనుకబాటులోనే ఉంది. ఇక్కడ 440 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు 2.7 మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గనిలో 10.21 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. గని పైకప్పు సీమ్ రెండు నుంచి మూడు మీటర్ల మందం ఉండాల్సి ఉండగా.. 1.5 నుంచి రెండు మీటర్లు మాత్రమే ఉంది. దీంతో ఎస్డీఎల్ యంత్రాల నిర్వహణ కష్టసాధ్యమవుతున్నది. బొగ్గు 70 శాతం ఉత్పత్తి అవుతుండగా.. అందులో 30 శాతం బండనే తీయాల్సి వస్తున్నది. దీంతో నష్టాల బాటన నడుస్తున్న గనిని మూసివేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
నిర్దేశించని వార్షిక లక్ష్యం..
సింగరేణి వ్యాప్తంగా అన్ని భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులకు ఆర్థిక సంవత్సరం ముగింపునకు మూడు నెలల ముందుగానే మరుసటి సంవత్సరానికి సంబంధించి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ వచ్చే 2022-23 ఆర్థిక సంవత్సరానికి అన్ని గనులకు లక్ష్యాలను నిర్దేశించిన, కేటాయించిన యాజమాన్యం.. మందమర్రి ఏరియాలోని ఆర్కే 1ఏ గనికి మాత్రం ఎలాంటి లక్ష్యాన్ని కేటాయించలేదు. గని మూసివేత నిర్ణయంతోనే లక్ష్యాలను కేటాయించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఎస్డీఎల్ యంత్రాలతో ఉత్పత్తి..
ఆర్కే 1ఏ గని మూసివేత నిర్ణయం నేపథ్యంలో గనిలోని సామగ్రిని వెలికి తీసేందుకు యాజమాన్యం టెండర్‌ను ఆహ్వానించింది. గతంలో మూసివేసిన గనుల్లో సామగ్రిని వెలికితీసిన మాదిరిగానే ప్రైవేట్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ద్వారా తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెండర్లు ఖరారైన తర్వాత సామగ్రి వెలికితీసే పనులను ప్రారంభిస్తారు. దీనికి రెండు నెలల కాలం పడుతుంది. సామగ్రిని వెలికి తీసేంత వరకు గనిలో 440 మంది కార్మికులు, మూడు ఎస్డీఎల్ యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఏరియాలోనే కార్మికుల సర్దుబాటు..
ఆర్కే 1ఏ గని మూసివేత సందర్భంగా గనిలో పని చేస్తున్న కార్మికులను మందమర్రి ఏరియాలోని గనుల్లోనే సర్దుబాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గనిలో పని చేస్తున్న 440 మంది కార్మికులను వారి డిజిగ్నేషన్ ఆధారంగా ఇతర గనులు, ఓపెన్ కాస్ట్, వివిధ విభాగాలకు బదిలీ చేయనున్నారు. సీనియారిటీ ప్రకారం వచ్చే పదోన్నతులను కూడా యథావిధిగా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులు ఎవరు, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాజమాన్యం భరోసా కల్పిస్తున్నది.
నష్టాలు వస్తున్నాయనే..
ఆర్కే 1ఏ గనిలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి జరుగక తరచూ నష్టాలు వస్తున్నాయి. దీంతో యాజమాన్యం మూసివేత నిర్ణయం తీసుకున్నది. బొగ్గు కన్నా ఉత్పత్తి వ్యయం అధికం అవుతున్నది. గనిలో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.7 వేల నుంచి రూ.9 వేలు వెచ్చించాల్సి వస్తున్నది. దీనిమూలంగా నెలకు రూ.4 నుంచి రూ.5 కోట్ల నష్టం వస్తున్నది. బొగ్గు వెలికితీతలో లాభం కంటే నష్టమే ఎక్కువ అవుతున్నది. కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏరియాలోని గనులు, విభాగాల్లో వారి అర్హతను బట్టి సర్దుబాటు చేస్తాం.