మెట్పల్లి,జనవరి 29:వేసిన పంటలను కాపాడుకొనేందుకు అన్నదాతలు ఎన్నో బాధలు పడ్డారు.. చేతికొచ్చే దశలో అడవి జంతువుల పాలవడంతో అరిగోస పడ్డారు. క్రూరమృగాల దాడిలో ఎందరో క్షతగాత్రులుగా మారారు..మరెందరో ప్రాణాలు విడిచారు..ఇలా రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి మెట్‌పల్లికి చెందిన అల్లాడి ప్రభాకర్ చలించిపోయారు. ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సంకల్పించారు. తన మెదడుకు పదునుపెట్టి ఫైర్గన్ను రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.
రైతులకు పంటలు సాగు చేయడం ఒక ఎత్తు.. వాటిని కాపాడుకోవడం మరో ఎత్తు..ముఖ్యంగా గుట్టబోరు ప్రాంతాల్లో పంటలను రక్షించుకోవడమంటే కత్తిమీద సామే. అడవుల విస్తీర్ణం పెరుగుతున్న దరిమిలా వన్యప్రాణులు, క్రూర మృగాల సంఖ్య అదేస్థాయిలో వృద్ధి చెందుతున్నది. ఈ నేపథ్యంలో అడవుల సమీపంలోని గ్రామాల్లోని రైతులు తాము వేసిన పంటలను రక్షించుకునేందుకు అనేక ఇబ్బందులుపడేవారు. అడవిపందులు, కోతులు, ఎలుగుబంట్లు, ఏనుగులు, ఖడ్గమృగాలు పంటలను ధ్వంసం చేస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో చేష్టలుడిగి పోయేవారు. కట్టెలు పోగుచేసి మంటలు పెట్టడం, డప్పులు మోగించడం, దివిటీలతో పొలాల దగ్గరకు వెళ్లాల్సివచ్చేది. అదేవిధంగా పంటపొలాలకు వెళ్లే రైతులు, గొర్రెలు, బర్రెల కాపరులు, గిరిజనులు, అటవీ శాఖ సిబ్బంది వన్యప్రాణుల దాడుల్లో గాయపడి మృతి చెందడం, తీవ్రంగా గాయపడిన ఘటనలు అనేకం ఉన్నాయి.
అయితే ఎంతటి క్రూరమృగాలైన మంటలకు భయపడి పరుగులు పెడుతుంటాయి. ఇది గమనించే అల్లాడి ప్రభాకర్ ఎల్పీజీ గ్యాస్‌తో కూడిన ఫైర్గన్ను రూపొందించారు. ఎల్పీజీ సిలిండర్‌ను భుజాన తగిలించుకుని ఒక కట్టె ద్వారా మూడు అడుగుల దూరంలో మంటను మండిస్తూ ముందుకు వెళ్లవచ్చు. అవసరాన్ని బట్టి మంటలను హెచ్చు తగ్గులు చేసుకునే విధంగా దీన్ని తయారు చేశారు. వన్యప్రాణులకు ఎదురెళ్లి ప్రమాదాన్ని నివారించవచ్చు. ఒక వేళ గుంపుగా వచ్చినా సిలిండర్ మంటను ఎక్కువ పెంచి తరిమికొట్టవచ్చు. వన్యప్రాణులను తరిమికొట్టే సమయంలో పొరపాటున మంటలు పక్కన అంటుకున్నైట్లెతే ముందు జాగ్రత్తగా ఒక చిన్న ఫైర్ స్టాప్‌ను ఉంచుకోవాలి. అలాంటి సందర్భాల్లో వెంటనే మంటలను ఆర్పివేయవచ్చు. ఆయన రూపొందించిన ఫైర్గన్ను ఇటీవల జిల్లా అటవీశాఖ కార్యాలయంలో అధికారుల సమక్షంలో ప్రదర్శించారు. వారు ఈ యంత్రం పనితీరును చూసి ప్రభాకర్‌ను అభినందించారు.
ఫైర్గన్తో రైతులకు ఎంతో మేలు
సింహాలు, పులులు, ఎలుగు బంట్లు, ఏనుగులు వంటి అడవి జంతువు ఎలాంటి ఆయుధాలకు భయపడవు. కేవలం అగ్ని, మంటలను చూసే పారిపోతుంటాయి. అందుకే పూర్వీకులు, ఆదివాసీలు ఇండ్లు, చేన్ల వద్ద మంటలు పెట్టుకొనేవారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పంట పొలాలు, పల్లెలు, పట్టణాల వైపు వన్యప్రాణులు రాకుండా నిరోధించేందుకు ఫైర్గన్ను తయారు చేశాను. ఐదు కిలోల బరువు కలిగిన సిలిండర్‌ను భుజానికి వేసుకుని చేతిలో స్టిక్కు (గన్)ను పట్టుకుని ఎలాంటి క్రూరమృగాలనైనా తరిమికొట్టవచ్చు. ఈ యంత్రంతో రైతులు, అటవీప్రాంతాల్లో నివసించేవారికి ఎంతో మేలు జరుగుతుంది. – అల్లాడి ప్రభాకర్, మెట్పల్లి