కలెక్టరేట్, అక్టోబర్ 11 : ఈనెల 16న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు రాసే అభ్యర్థుల వేలిముద్ర తీసుకున్న అనంతరమే, పరీక్ష కేంద్రంలోని అనుమతించనున్నారు. ఉదయం 10-15 గంటలలోపు మాత్రమే పరీక్ష కేంద్రంలోనికి ఎంట్రీ ఉంటుంది. పరీక్ష ప్రారంభానికి పావుగంట ముందే పరీక్ష కేంద్రం ప్రధాన ద్వారం మూసివేస్తారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో ఏవో డా.ఎం.నారాయణ టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన పరీక్షల నిర్వహణ మార్గదర్శకాలు విలేకరులకు వెల్లడించారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకే ఈసారి నిబంధనలు కఠినతరంగా అమలు చేయాలని టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన సూచనలు అమలు చేయనున్నామన్నారు. వేలిముద్ర, డాక్యుమెంట్ల పరిశీలన కోసం అభ్యర్థులు 8.30 వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపుకార్డు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుండగా, హాలులోకి వెళ్లిన అనంతరం పరీక్ష ముగిసేదాకా అభ్యర్థులు బయటకు వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు. చేతులకు మెహందీ, నెయిల్ పాలిష్, టాటూలు లాంటి అలంకరణలు చేయకూడదని సూచించారు. ఓఎంఆర్ షీట్‌పై ఎరేజర్, బ్లేడ్, వైట్నర్ లాంటివి ఉపయోగించినా, అలాగే, జవాబుపత్రంలోని వృత్తాల్ని నిబంధనల మేరకు భర్తీ చేయకున్నా, డిస్ క్వాలిఫైగా పరిగణించనున్నట్లు తెలిపారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులై, మెయిన్స్ పరీక్షకు వచ్చే అభ్యర్థుల వేలిముద్రలు ప్రస్తుతం తీసుకునే వేలిముద్రలతో సరిపోవాలని, లేకుంటే పరీక్ష రాసే అవకాశముండదని చెప్పారు. హాల్‌టికెట్లను ఏ4 సైజులో ప్రింట్ తీసుకుని రావాలని, ఫొటో సక్రమంగా రాకపోయినా, సంతకం లేకపోయినా గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించుకుని రావాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని 19 విద్యా సంస్థల్లో 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ఒక్కో కేంద్రానికి 480 మంది చొప్పున 17వేల మంది అభ్యర్థులు పరీక్షలు సజావుగా రాసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అడిషనల్ కలెక్టర్ పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ కొనసాగుతుందన్నారు.