కలెక్టరేట్, అక్టోబర్ 11: బాలికలు చదువు ద్వారానే సమానత్వం సాధించగలుగుతారని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ, మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం ద్వారా బాల్య వివాహాలు తగ్గినట్లు తెలిపారు. బాలికలు తమను తాము రక్షించుకుంటూ, అన్ని రంగాల్లో ముందంజలో ఉండేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. నేటి బాలికలే రేపటి భావిభారత మహిళలుగా నిరూపించాలని ఆకాంక్షించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, బాలికల స్వేచ్ఛ, సమానత్వానికి కేవలం చదువు మాత్రమే సహకరిస్తుందన్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధిస్తే, సమాజంలో పురుషులకన్నా దీటుగా నిలువగలుతారని అన్నారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, బాలికలు ఆటలు, వ్యాయామం ద్వారా శారీరక దృఢత్వాన్ని, చదువు ద్వారా ఆర్థిక, సామాజిక ఎదుగుదలను సాధించవచ్చన్నారు. జిల్లా సంక్షేమాధికారి సబితాకుమారి మాట్లాడుతూ, బాలికల కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18ఏళ్లలోపు పిల్లలు సమస్యలుంటే నంబర్ 1098కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన బాలికలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అంతకుముందు ఆడిటోరియంలో చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి, ఎంఈవో వేణుకుమార్, కేవీకే శాస్త్రవేత్త ప్రశాంతి, సీడీపీవోలు ఉమారాణి, సరస్వతి, శాంత, కృపారాణి పాల్గొన్నారు.