రాంనగర్, జనవరి 29: మావోయిస్టు పార్టీలో పని చేసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని ఈనెల 10న గంగాధర పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రదారిగా భావిస్తున్న ఒడిశా రాష్ట్రంకు చెందిన ఆనెం చంద్రారావును శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితున్ని కమిషనరేట్ కేంద్రంలో మీడియా ఎదుట హాజరుపరిచి సీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. గంగాధర మండలం కొండయ్యపల్లి గ్రామానికి చెందిన మల్యాల సురేశ్ అనే వ్యక్తి పేలుడు పదార్థాలు తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్తుండగా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. విచారణలో సురేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం పొలిశెట్టి రవిని ఈ నెల 21న, కొలుముల నాగభూషణంను ఈనెల 24న, బండి రమేశ్ అలియాస్ విప్లవ్కుమార్ను ఈనెల 26న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీపీ తెలిపారు. విచారణలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఒడిశా రాష్ట్రం గంజాబ్ జిల్లా మంగళవారిపేటకు చెందిన అనెం చంద్రారావు ముందస్తు బెయిల్ కోసం హైదరాబాద్‌కు వస్తున్నాడన్నా సమాచారంతో శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. చంద్రారావు ఇంటర్ వరకు చదివి మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై 1979లో సీపీఐ ఎంఎల్లో చేరాడు. గోరు మాధవరావు అనే వ్యక్తి ద్వారా శ్రీకాకుళం జిల్లా కమిటీలో పని చేసి ఒడిశా రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించాడు.
రాష్ట్ర కో-ఆర్డినేటర్ స్థాయికి ఎదిగి 1989లో శాంతి కుమారిని వివాహం చేసుకొని పార్టీకి రాజీనామా చేశాడు. అతడి రాజీనామాను పార్టీ ఆమోదించకుండా తిరిగి పని చేయాలని సూచించడంతో 1996 వరకు ఇంటి వద్దే ఉంటూ పార్టీలో రిక్రూట్మెంట్ చేస్తూ బలోపేతం కోసం ప్రయత్నించాడు. పార్టీ సభ్యుడు మడ్డు బాబూరావుతో బేదాభిప్రాయాలు రావడంతో బయటికి వచ్చిన చంద్రారావు ఒడిశాలో వ్యాపారం మొదలు పెట్టి కొంతమంది సానుభూతిపరులతో ఒడిశా పీపుల్స్‌వార్ పార్టీని స్థాపించాడు. 2009లో మావోయిస్టు పార్టీకి చెందిన సవ్యసాచి పాండా విబేధాల కారణంగా పార్టీ నుంచి బయటికి వచ్చి చంద్రారావుతో కలిసి పని చేశాడు. మావోయిస్టు పార్టీకి అంతర్గతంగా, బహిరంగంగా రిక్రూట్మెంట్లు చేయడంతో పాటు మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేయడంలో ఆనెం చంద్రారావు కీలకంగా వ్యవహరించాడు. కొండయ్యపల్లి కేసులో అతను కూడా నిందితుడు కావడంతో ముందస్తు బెయిల్ కోసం హైదరాబాద్ హైకోర్టుకు రాగా అదుపులోకి తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితున్ని పట్టుకున్న సీఐ నాగేశ్వర్రావు, ఎస్ఐ నరేశ్‌రెడ్డిని సీపీ అభినందించారు.