పెళ్లెప్పుడవుతుంది బాబూ..! నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు..! దశాబ్దాల క్రితం రాసిన ఈ సినిమా పాట ప్రస్తుత పరిస్థితులకు అతికినట్టు సరిపోతుంది. నిజానికి పెండ్లి రెండు జీవితాలను ముడివేసే బంధం. ఒకరికి ఒకరై సాగే నూరేండ్ల పంట. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. మూడుముళ్లతో ఏకం కావాలని కోరుకునే ఎంతో మంది అబ్బాయిలకు ఇటీవలి కాలంలో పిల్ల దొరుకుత లేదు. మూడు పదుల వయసు దాటుతున్నా పెండ్లి కావడం లేదు. ఒకటి రెండు కాదు మెజార్టీ కమ్యూనిటీల్లో అమ్మాయిల కొరత వేధిస్తున్నది. ఫలితంగా పెళ్లికాని ప్రసాదుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నది. కొన్ని కమ్యూనిటీల్లో ఉన్నా.. యువతుల అభిరుచులకు అబ్బాయిలు సరిపోక అక్కడా సమస్యే వస్తున్నది. ఎటొచ్చీ తమ శ్రీమతి కోసం యువకులు పడుతున్న పాట్లను చూసి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లా బాలబాలికల నిష్పత్తిని ఓ సారి నిశితంగా పరిశీలిస్తే.. భవిష్యత్తులో కన్యాశుల్కం తప్పదేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
– కరీంనగర్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మాంగళ్యం తంతునానేనమమ జీవన హేతునా..!
కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం వతమ్!!
‘నా జీవనానికి కారణమైన ఈ సూత్రంతో నేను నీ మెడలో మాంగళ్యం కడుతున్నాను. నీవు నిండు నూరేళ్లు జీవించు అని భావం.’ మనిషి జీవితంలో వివాహమనేది అతి ముఖ్యమైన ఘట్టం. ‘పెండ్లి నూరేండ్ల పంట’ అని పెద్దలంటారు. స్త్రీ పురుషుల దాంపత్య ధర్మాచరణకు వివాహమే ఒక ప్రవేశద్వారం అంటారు. గృహస్థ జీవితం కోరుకొనే స్త్రీ పురుషులను జీవితాంతం వరకూ అన్యోన్యం, అనురాగబంధంతో ముడివేసేది వివాహ వ్యవస్థ. ఇది ఎంతో పవిత్రమైనది. ఈ శుభఘడియల కోసం ఎంతో మంది అబ్బాయిలు ఎదురు చూస్తున్నారు.
పరిచయ వేదికలకు అబ్బాయిల క్యూ..
కరీంనగర్ జిల్లాలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఒక కమ్యూనిటీలో అమ్మాయిలు కొరత అధికంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని.. ఆ సంఘం పెద్దలు ఓ ఆలోచన చేసి.. వధూవరుల వివరాల సేకరణకు సంఘం ఆధ్వర్యంలో ఒక రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. అయితే గడిచిన ఎనిమిది నెలల కాలంలో 1,752 మంది అబ్బాయిలు, 476 మంది అమ్మాయిలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో సదరు సంఘం ఇప్పటికి మూడుసార్లు పరిచయ వేదికలు నిర్వహిస్తే.. ఇరువురు ఒక్కటైంది కేవలం 83 మంది మాత్రమే.
కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం వివాహ పరిచయవేదికలను నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఈ నెల 18న మూడోసారి ఏర్పాటు చేసింది. అయితే, ఇప్పటి వరకు 140 మంది అబ్బాయిలు తమ బయోడేటా ఇవ్వగా.. కేవలం 40 మంది అమ్మాయిలు మాత్రమే తమ పేర్లు నమోదుచేసుకున్నారు. ఈ కమ్యూనిటీలోనూ తీవ్ర కొరత ఉన్నది.
ఇటీవలి కాలంలో హైదరాబాద్, నిజామాబాద్‌లో రెడ్డి కమ్యూనిటీ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేశారు. ఈ వేదికలకు 70 శాతం అబ్బాయిలు వస్తే.. 30 శాతం అమ్మాయిలు వచ్చారు. ఇవి మచ్చుకు మాత్రమే. ప్రతి కమ్యూనిటీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. వెల్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య కమ్యూనిటీల్లోనూ అమ్మాయిల కొరత కనిపిస్తున్నది. అలాగే పద్మశాలీ, మున్నూరుకాపు, పెరుకతోపాటు పలు కమ్యూనిటీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి.
పరిచయ వేదికల్లోనూ తిప్పలే..
ఆయా సామాజికవర్గాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆయా కుల సంఘాలు వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తున్నాయి. వీటికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. అంతే కాదు, ఆయా కుల సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి సభ్యుడికీ సమాచారం ఇస్తూ.. పరిచయ వేదికల విషయాన్ని తెలియజేస్తున్నాయి. వేదికలు ఏర్పాటు చేసే రోజు ఉచిత భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఈ తరహా పరిచయ వేదికలకు అబ్బాయిలు క్యూ కడుతున్నారే తప్ప.. అమ్మాయిల సంఖ్య నానాటికీ తగ్గుతున్నది.
అడ్డంకిగా తల్లిదండ్రుల ఆశలు!
అబ్బాయి మంచి విద్యావంతుడై ఉండి.. మంచి ఉద్యోగం ఉన్న చోటుకు అమ్మాయిల తల్లిదండ్రులు వెళ్తున్నారు. ఇదే అదనుగా కొంత మంది అబ్బాయిల తల్లిదండ్రులు హద్దు మీరి కోరికలు కోరుతున్నారు. కట్నంతోపాటు బంగారం, భూములు ఇవ్వాలంటూ షరతులు పెడుతున్నారు. అయితే, ఈ షరతులు పెట్టే బంధాలను అమ్మాయిల తల్లిదండ్రులు పెద్దగా ఒప్పుకోవడం లేదు. దీంతో మూడు నాలుగు సంబంధాలు దూరమయ్యాక.. సదరు అబ్బాయికి అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకురావడం లేదు. అప్పుడు వాళ్లు ఎదురెళ్లినా.. మీరు కట్నం ఎక్కువ అడుగుతున్నారట కదా! మేం ఇవ్వలేమన్న సమాధానాలే వస్తున్నాయి. దీంతో అన్ని అర్హతలున్నా కొంత మంది అబ్బాయిలు కూడా పెళ్లికాని ప్రసాదుల్లా ఉండిపోవాల్సి వస్తున్నది.
భవిష్యత్‌లో కన్యాశుల్కమే!
ఇప్పుడే అమ్మాయిల కొరత ఇలా ఉంటే.. భవిష్యత్‌లో ఉమ్మడి జిల్లాలో కన్యాశుల్కం తప్పదేమో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బాలబాలికల నిష్పత్తిలో భారీ తేడా ఉండడమే ఇందుకు నిదర్శనం. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. జిల్లాలో బాలబాలికల మధ్య నిష్పత్తి చాలా దారుణంగా ఉంది. పూర్వ ఉమ్మడి జిల్లా జనాభా మొత్తం 37,76,269 మంది కాగా, అందులో పురుషులు 18,80,800, మహిళలు 18,95,469 మంది ఉన్నారు. అంటే పెద్దవాళ్లలో చూస్తే పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులకు 1005 మంది మహిళలు ఉన్నారు.
కానీ, చిన్న పిల్లల విషయానికి వచ్చే సరికి మాత్రం పరిస్థితి తారుమారైంది. 0-6 సంవత్సరాల వయసు గల బాలబాలికల సంఖ్య 3,36,053 మంది కాగా, అందులో 1,73,647 మంది బాలురు 1,62,406 మంది బాలికలు ఉన్నారు. బాలికల కన్నా.. బాలురు 11,241 మంది అధికంగా ఉన్నారు. ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలికలకు 935 మంది బాలికలున్నారు. ఉన్న 3,36,053 మంది బాలబాలికల్లో గ్రామీణ ప్రాంతాల్లో 2,44,443 మంది ఉండగా, అందులో బాలురు 1,26,222 మంది ఉండగా, బాలికలు 1,18,221 ఉన్నారు. అంటే ప్రతి వెయ్యి మంది బాలురకు 936 మంది బాలికలున్నారు. అలాగే, అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 91,610 మంది ఉండగా, అందులో 47,425 మంది బాలురు, 44,185 మంది బాలికలున్నారు. ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు 932 మంది బాలికలే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ పరిస్థితి ఉంటే.. 2022లో జనాభా లెక్కలు చేస్తే ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మారుతున్న అమ్మాయిల అభిరుచులు
ఇటీవలి కాలంలో యువతుల అభిరుచులూ మారుతున్నాయి. గతంలో అమ్మాయి తరఫువారికి అబ్బాయి నచ్చితే సరిపోయేది. కానీ, ఇప్పుడు అమ్మాయిలకు నచ్చితేనే పెండ్లికి ఓకే చేస్తున్నారు. అబ్బాయి వయసు, సంపాదన, బ్యాక్‌గ్రౌండ్ ఇలా అన్నీ చూసుకున్న తర్వాతనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ముఖ్యంగా పెద్ద కుటుంబాలను కోరుకునేందుకు ఇష్టపడడం లేదు. పెళ్లి కాగానే వేరు కాపురం పెడుతారా..? లేదా..? అన్న కోణంలోనే అమ్మాయిలు చూస్తున్నట్లుగా ఇటీవల జరిగిన అనేక సర్వేల్లో బయటపడింది. దీంతో ఎక్కువగా ఉమ్మడి కుటుంబంలోనే పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నట్లు ఆయా కుల పెద్దలు చెబుతున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులూ ఇదే విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. తమ బిడ్డకు కష్టం వాటిల్లకుండా ఉండాలన్న తపననే ప్రదరిస్తున్నారు తప్ప.. ఉమ్మడి కుటుంబం వల్ల జరిగే ప్రయోజనాలను చాలా మంది పిల్లలకువివరించడం లేదని సామాజిక తత్వవేత్తలు చెబుతున్నారు.
అమ్మాయిలు కొరత చాలా ఉన్నది
మా పద్మశాలి కమ్యూనిటీలో అమ్మాయిల కొరత చాలా ఉన్నది. సంబంధాలు దొరకడం కష్టమవుతున్నది. పద్మశాలి సంక్షేమ ట్రస్టు నుంచి మా వంతుగా అనేకసార్లు వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ నెల 18న కూడా మరో పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు 140 మంది అబ్బాయిలు, 40 మంది అమ్మాయిలు మాత్రమే తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇది ఈ ఒక్కసారే కాదు, తరచూ ఇదే పరిస్థితి ఏర్పడుతున్నది. భవిష్యత్‌ను తలుచుకుంటేనే భయం వేసే పరిస్థితి ఉన్నది.
– భద్రయ్య, పద్మశాలి సంక్షేమ ట్రస్టు జనరల్ సెక్రటరీ
అమ్మాయిల ట్రెండ్ మారింది
సమాజంలోని అన్ని సామాజికవర్గాలు ఎదుర్కొంటున్నట్లుగానే వైశ్య కమ్యూనిటీలోనూ కొరత ఉన్న మాట వాస్తవం. ఆర్యవైశ్య సంఘం నుంచి అనేకసార్లు వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో 60 నుంచి 70 శాతం అబ్బాయిలు హాజరవుతుంటే.. అమ్మాయిలు 20 నుంచి 25 శాతం వస్తున్నారు. అంతే కాకుండా, చాలా సామాజికవర్గాలను అధ్యయనం చేసి చూస్తే అమ్మాయిల ట్రెండ్ మారినట్లుగా కనిపిస్తున్నది. ఎక్కువ సామాజిక వర్గాల్లో అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు చిన్న కుటుంబాలను ఇష్టపడుతున్నట్లుగా అర్థమవుతున్నది.
– గౌరిశెట్టి మునీందర్, ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు